Heavy Rain Lashes Joint Krishna District : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం అయింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డును సృష్టించింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు 4 అడుగుల మేర నిలవడంతో ఎటు చూసిన కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ భారీ వర్షాలకు చిగురుటాకులా గజగజ వణికింది. ఏ రోడ్డు, ఓ కాలనీ చూద్దామన్నా వరద నీటితో భయంకర వాతావరణాన్ని సృష్టించింది.
విజయవాడ సిటీలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు రైల్వేస్టేషన్ చుట్టూ వరద నీరు చేరింది. అలాగే ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. మరోవైపు విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. సింగ్‌నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్నగర్లు పూర్తిగా జలవలయంలో చిక్కుకుని చెరువులను తలపించాయి. విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలు నరకాన్ని చూపించాయి.
బుడమేరు వాగు ఉద్ధృతం : విజయవాడ నగరంలోని బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో దిగువన ఉన్న కాలనీలు, వీధులు వరదనీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వద్ద వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. వంతెనకు నాలుగు అడుగుల మేరకు ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలతో గుడివాడ-హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసేశారు. అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగిపోయాయి.
మహోగ్రరూపం దాల్చుతున్న మున్నేరు :తెలంగాణలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి ఉపనది మున్నేరు వాగు ఏపీలో అదే రీతిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని పరివాహక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాదస్థాయిలో వరద చేరింది. ఎస్సీ కాలనీ, బోస్పేట జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. అలాగే రహదారులపై గుంతలు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.