Recognizing as Best Govt School in Yapalguda :పచ్చని పూలమొక్కలు, పిల్లలతో సందడిగా కనిస్తున్న ఈ పాఠశాల ఆదిలాబాద్ జిల్లా యాపల్‌గూడలో ఉంది. ఒకటో తరగతి నుంటి ఐదో తరగతి వరకు 3 వందల 40 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆహ్లాదకర వాతావరణానికి తోడు, పోటీ ప్రపంచంతో పరుగులు పెట్టేలా, తల్లిదండ్రుల అభిరుచులకు తగ్గట్లుగా ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధిస్తున్నారు. అందుకే ఈ పాఠశాలలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
యాపల్‌గూడ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల 13 గ్రామాల నుంచి పిల్లలకు ఈ సర్కారు బడికి వస్తున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా సాంకేతిక(Technology)పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్(English) మాట్లాడేలా తీర్చిదిద్దుతున్నామని టీచర్లు చెబుతున్నారు. 18 మంది విద్యార్థులు ఇటీవల ఆంగ్లంలో ఒక్కో కథ రాయగా ఆ కథల సంపుటితో పుస్తకం ముద్రించారు. ఆ పుస్తకాన్ని హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఇంగ్లీష్‌లో కథలు రాసిన పిల్లలు రచయితల, ప్రముఖుల మన్ననలు పొందారు.
'మేము మా దగ్గర ఉన్నటువంటి టీవీని ఉపయోగించి, దాని ద్వారా పిల్లలకు పాఠాలు చెబుతున్నాం. మొబైల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి వీడియోస్ రూపంలో పిల్లలకు బోధిస్తున్నాం. పిల్లలు వాటిని చూస్తూ అర్థం చేసుకుంటున్నారు. దీని వల్ల పిల్లలు ఎక్కువ శాతం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ మాధ్యమం వల్ల ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా అడిషన్, సబ్ట్రాక్షన్ వస్తుంది.'-జంగు, ఉపాధ్యాయుడు