Best Areas to Buy Place in Hyderabad :భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్‌ఆర్‌ఆర్, ఫోర్త్‌సిటీ ప్రతిపాదనలతో నగరంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంతో తక్కువ ధరతో స్థలాన్ని కొనుగోలు చేయడానికి అన్వేషించడం ప్రారంభించారు. ఒకప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఇల్లు, స్థలాలు కొనలేకపోయినవారు ఇన్నర్ రింగ్‌రోడ్డు చుట్టుపక్కల కొనుగోలు చేశారు. ఇక్కడ కొనుగోలు చేయనివారు ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల వరకు వెళ్లారు. స్థలాలు, విల్లాలు కొనుగోలు చేశారు.
ప్రాంతీయం రహదారి అవకాశాలమయం :నగరంలో ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యనే రియల్ ఎస్టేట్ విస్తరణకు అవకాశం ఉంటుందని రియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) 347 కి.మీ. పొడవున రాబోతుంది. ఇది 20 పట్టణాలు, 175 గ్రామాల మీదుగా వెళుతోంది. 17 వరకు రాష్ట్ర, జాతీయ రహదారులు అనుసంధానం కాబోతుంది. ఇవి కాకుండా పలుచోట్ల ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ కలుపుతూ రేడియల్ రహదారులను నిర్మించనున్నారు. రియల్టీ పరంగా ఇదో మంచి పరిణామం అంటున్నారు డెవలపర్లు.
ఒక్కొక్కటిగా మౌలిక వసతులు : రాష్ట్రంలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలోనే పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. కళాశాలలే కాదు ప్రముఖ అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు సైతం ఇక్కడ విశాలమైన ప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం సిటీ నుంచి రోజూ విద్యార్థులు వెళ్లి వస్తున్నారు. లేదంటే హాస్టళ్లలో ఉంటున్నారు. త్వరలో ఆయా విద్యా ప్రాంగణాల చుట్టుపక్కల భారీగా నివాసాలు వచ్చే అవకాశం ఉందని రియల్ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లు సైతం ఓఆర్‌ఆర్ బయటే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రద్దీ పెరిగేకొద్దీ రవాణా వ్యవస్థ మెరుగుయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మెట్రో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి టూరిస్టు కేంద్రం, సమతామూర్తి కేంద్రం, కన్హా శాంతివనం, ప్రముఖ దేవాలయాలు, రిసార్ట్‌లన్నీ అవుటర్, ఆర్ఆర్ఆర్ రహదారి మధ్యనే కేంద్రీకృతం అయ్యాయి. ఈ కేంద్రాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు భారీగానే వస్తున్నారు.
రాష్ట్రంలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీని, టౌన్‌షిప్పులు, క్రికెట్ స్టేడియం వంటివి నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫ్యూచర్ సిటీ నుంచి రావిర్యాల మీదుగా మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.