ఉద్యోగులకు గుడ్ న్యూస్- LTC రూల్స్ ఛేంజ్- ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ వెళ్లే వీలు - EMPLOYEES TRAVEL VIA VANDE BHARAT
ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ కింద తేజస్, వందేభారత్ రైళ్లలో ప్రయాణానికి అనుమతి - సెలవు+జీతంతో పాటు టికెట్లపై రీయింబర్స్మెంట్ కూడా!
Published : Jan 15, 2025, 4:05 PM IST
Employees Travel Via Vande Bharat : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కింద తేజస్, వందే భారత్, హమ్సఫర్ రైళ్లలో ప్రయాణించడానికి కేంద్రం అనుమతించింది.
వివిధ ప్రభుత్వ సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చిన అనేక సూచనలను పరిశీలించిన అనంతరం, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)- ప్రీమియం రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
'ఇప్పటి వరకు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై ఎల్టీసీ కింద తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ వారు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం.' అని డీఓపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కనుక ఇకపై అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్మెంట్ కూడా పొందుతారు.