Rajamma Tanda Healthiest Village in Telangana :ఆధునిక కాలంలో కాలుష్య వాతావరణంలో కల్తీ ఆహారం తీసుకుంటూ నిత్యం రోగాలతో మనిషి సహవాసం చేస్తున్నాడు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ పల్లె మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది. కాలుష్యానికి, వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో జీవిస్తోంది. కరోనా రెండు దశల్లోనూ ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండా వాసుల జీవన శైలి అర్థం చేసుకోవచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. తండాలో ఆయు ప్రమాణం 90 ఏళ్ల పైమాటే అంటే ఆశ్చర్యపోవద్దు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజమ్మతాండ ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ఇక్కడి ప్రజలు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు ఆస్పత్రులకూ దూరంగా ఉంటున్నారు. సహజ సిద్ద వాతావరణంలో జీవించడం వల్ల వారికి ఎలాంటి రోగాలు రావు. రాజమ్మతండాలో 30 ఇళ్లు వంద వరకు జనాభా ఉంటుంది. పచ్చని ప్రకృతి మద్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం.
3500 మంది రైతులకు శిక్షణ.. 200 రకాల విత్తనాల ఉత్పత్తి.. అందుకే 'ఆమె'కు పద్మశ్రీ!
Healthy Village Rajamma Tanda in Kamareddy :ఈ తండాలో 30 ఏళ్లుగా ఏడుగురు మాత్రమే మృతి చెందారు. 90 ఏళ్ల పైబడి ఉన్నవారూ వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వంటలు కట్టెల పొయ్యిపైనే చేస్తారు. ప్రధాన ఆహారం మక్క రొట్టె, వెల్లుల్లి కారం. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తాండ వాసులు చెబుతున్నారు. పొలాల్లో పండించిన తాజా కూరగాయలను మాత్రమే వాడతారు.