Rain water In Mallareddy Hostel: హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదిలింది. అబిడ్స్ నుంచి కోఠి రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలో రోడ్డుపై వరద పొంగిపొర్లింది. సమీప హాస్టల్స్‌లోకి నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కనీస నిబంధనలు పాటించకుండా హాస్టల్ భవనాలు నిర్మించడం వల్లే వర్షపునీరు చుట్టుముడుతోందని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వరద హాస్టళ్లను ముంచెత్తింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి. రామ్‌నగర్ వినోబా కాలనీకి చెందిన విజ్జు అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. నగరంలో కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Heavy Rain In Medak : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో గల ఊరు చెరువు కట్టకు గండి పడింది. సామర్థ్యానికి మించి నీరు చెరువులోకి రావడం, కట్ట బలహీనంగా ఉండడంతో గండి పడి నాట్లు వేసిన పొలాల్లోకి నీరు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షానికి తోడు ఎగువ నుంచి ప్రవాహంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. బీబీ నగర్ మండలం రుద్రవెల్లి భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్యలో లెవల్ బ్రిడ్జిపై నుంచి ప్రవాహం పోటెత్తింది.