Radisson Drug Case Update :రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇందులో ప్రముఖ సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. ముందుగా ఈ కేసులో శుక్రవారం విచారణకు హాజరవుతానని చెప్పిన క్రిష్(Director Krish) ఆ తర్వాత సోమవారం రోజు వస్తానని సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం నేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని జాగర్లముడి క్రిష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాగర్లముడి క్రిష్ దర్శకత్వం వహించారని ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు(Film Fare Award)ను సైతం దక్కించుకున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది అచ్యుత్ భరద్వాజ్ కోర్టుకు తెలిపారు. ఈ నెల 25వ తేదీన గచ్చిబౌలి పోలీసులు రాడిసన్ హోటల్‌లో పక్కా సమాచారం మేరకు దాడులు చేసి రెండు గదుల్లో పార్టీ నిర్వహించి కొకైన్(Drugs Case) సేకరించినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అందులో రాడిసన్ హోటల్ యజమాని కుమారుడు వివేకానందను ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు.
వివేకానంద ఇచ్చిన సమాచారం మేరకు కొంత మందిని నిందితులుగా చేర్చారని అందులో 10వ నిందితుడిగా జాగర్లముడి క్రిష్ పేరు చేర్చినట్లు అచ్యుత్ భరద్వాజ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కనీసం సంఘటనా స్థలానికి కూడా క్రిష్ వెళ్లలేదని న్యాయవాది తెలిపారు. క్రిష్ నివాసం హైదరాబాద్‌లోనే ఉందని ఆయన ఎక్కడికి వెళ్లడని పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తారని అచ్యుత్ భరద్వాజ్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులకు సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 8 మందిపై కేసు నమోదు