Pulichintala Project Gates Open: పులిచింతల నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికారులు 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండటంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు జలకళ సంతరించుకోవటం రైతుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది. కృష్ణమ్మ పరవళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నందున ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది.
కృష్ణా డెల్టా ఆయకట్టుని స్థిరీకరించే లక్ష్యంతో పులిచింతల ప్రాజెక్టుని నిర్మించారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేక 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. గేటు బిగించటం కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ఆ తర్వాత గేటు బిగించటానికి జగన్ ప్రభుత్వం దాదాపు రెండేళ్లు సమయం తీసుకుంది. గేటు బిగించిన తర్వాత ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో పూర్తిగా నిండలేదు. నిన్నమొన్నటి వరకూ అట్టడుగు నీటిమట్టాలు ఉండేవి.
భారీ వర్షాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వచ్చిపడుతున్న వరదతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నిండిపోవటంతో ప్రకాశం బ్యారేజికి నీరు విడుదల చేస్తున్నారు. వరద ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని రోజులు గేట్లు ఎత్తి ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. వరద కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. అయితే ఇప్పటికే అక్కడి ప్రజలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించారు. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు లేని కారణంగా కొందరు తిరిగి వచ్చి గ్రామాల్లో ఉంటున్నారని వారిని ఖాళీ చేయాలని సూచించినట్లు పులిచింతల ఎస్ఈ తెలిపారు.