School Bus Carrying Students Fell Into Canal: విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంలోని జల్లేరు వంతెన డైవర్షన్ రహదారిపై వెళ్తూ అదుపు తప్పిన బస్సు కాల్వలోకి ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ విద్యార్థులను కిందకు దింపారు. స్థానికులు ట్రాక్టర్ సాయంతో ఒరిగిన బస్సును నిలబెట్టారు. ప్రమాద ఘటన నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వంతెన లేక జల్లేరుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా వంతెన నిర్మించాలని కోరారు.
ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని నిర్మాణం: పట్టెన్నపాలెం వంతెన లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. అక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జల్లేరు వాగుపై హైలెవల్ వంతెనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం దిగిపోయే నాటికి పిల్లర్లు పూర్తి చేసి ఓ వైపు శ్లాబు నిర్మాణం చేపట్టారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణం గాలికొదిలేసింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు వేసి, పైన శ్లాబులు పూర్తి చేస్తే వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ నాయకులు పట్టించుకున్న పాపానపోలేదు.
బిల్లులు చెల్లించని వైఎస్సార్సీపీ సర్కార్ - సగంలో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
40కి పైగా గ్రామాలకు ఇదే మార్గం: వంతెన పూర్తి కాక, కల్వర్టు నిర్మాణం రాళ్లు తేలి అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాగులో దిగి ఎక్కే క్రమంలో వాహనాలు అదుపుతప్పి పడిపోయి కొంతమంది గాయపడిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో వరదతో ఈ వాగు పోటెత్తుతుంది. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు రాకపోకలు సాగించడానికి వీలుండదు. వైఎస్సార్సీపీ పాలకులు నిర్మాణ పనులు పట్టించుకోక పిచ్చి మొక్కలు మొలిచి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో వంతెన కనిపిస్తోంది.
జల్లేరు వాగు అవతలివైపున ఉన్న సుమారు 40కి పైగా గ్రామాలకు ఇదే మార్గం. నిత్యం ఇటుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుకు వెళ్లేందుకూ ఇదే ప్రధానమార్గం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికీ ఈ వాగు దాటుకునే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారిలో వంతెన నిర్మాణం కలగా మారింది.
ఓవైపు పచ్చని పొలాలు, మరోవైపు కృష్ణమ్మ - మధ్యలో బాహుబలి బ్రిడ్జి - ఇవిగో డ్రోన్ విజువల్స్
అప్పుడు కుంగింది - ఇప్పుడు కూలింది - విజయవాడకు నిలిచిన రాకపోకలు