Priyanka Enterprises Fraud :హైదరాబాద్ అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ భారీ మోసాలకు పాల్పడి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి 200 కోట్లు రూపాయలను వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా ఇవాళ బషీర్‌బాగ్‌లోని సీసీస్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ప్రియాంక జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త నేతాజీకి శ్రీ ప్రియాంక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఉంది. అందులో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీలు వస్తాయనే ఆమె ప్రలోభ పెట్టింది. ఆధిక వడ్డీ ఆశతో గత కొన్నేళ్లుగా చాలామంది టెస్కాబ్ అధికారులు, పలు జిల్లాల డీసీసీబీల సిబ్బంది ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు చేసినట్లు బాధితులు తెలిపారు. టెస్కాబ్‌లో పనిచేస్తున్న ఆ అధికారిణి మరో మూడు నెలల్లో పదవీ విరమణ పొందనుండగా ఇటీవల హఠాత్తుగా ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లింది.
ఆ వెంటనే కొన్ని రోజులకు ఫైనాన్స్ కంపెనీ మూతపడింది. ఇప్పుడు ప్రియాంక లాంగ్ లీవ్‌పై వెళ్లిపోవడం, శ్రీ ప్రియాంక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీకి తాళం వేసి ఉండటంతో తామంతా మోసపోయామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అధిక వడ్డీ ఆశ చూసి తామందరిని మోసం చేశారని వారు వాపోయారు. అధికారిణి అందుబాటులో లేకపోవడంతో పాటు ఆమె భర్త జాడ తెలియకపోవడంతో డిపాజిట్ల చేసిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తాము కొందరమే వచ్చామని, ఇంకా చాలా మంది బాధితులు బయటకు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.