తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం! - ఎందుకో తెలుసా? - Real Estate Market in Hyderabad - REAL ESTATE MARKET IN HYDERABAD

Present Real Estate Market in Hyderabad 2024 : హైదరాబాద్​లో ఇళ్లు, స్థలాలు కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయమని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా ధరలు స్తబ్దుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో డెవలపర్స్‌తో బేరమాడే అవకాశమూ ఉంటుందని చెబుతున్నారు.

Present Real Estate Market in Hyderabad
Present Real Estate Market in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 12:51 PM IST

Present Real Estate Market in Hyderabad :ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు కొనొచ్చా? ముందు ఎలా ఉండబోతుంది? కొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ రియల్టర్లను అడుగుతున్న ప్రశ్నలివి. మార్కెట్​లో హెచ్చుతగ్గులు సహజమని, ఇల్లు, ప్లాట్లు కొనాలి అనుకునే వారికి ఇదే సరైన సమయమని రియల్టర్లు చెబుతున్నారు. ఇప్పటి నుంచి వెతకడం మొదలుపెడితే, దసరా వచ్చే సరికి స్థిరాస్తిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

ధర తగ్గించే అవకాశం :రియల్‌ ఎస్టేట్ రంగంలో కొద్ది మంది పెట్టుబడిదారులు మినహా ఎక్కువ మంది తమ సొంత అవసరాల కోసమే స్థిరాస్తులను కొనేవారుంటారు. ఉండటానికి ఇల్లు, విల్లాలు, ఫ్లాట్లు, భవిష్యత్ అవసరాల కోసం వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అవసరాలు. అందుకే పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటప్పడు మార్కెట్‌తో సంబంధం లేకుండా, నిజానికి స్తబ్దుగా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే డెవలపర్‌తో బేరమాడేందుకు అవకాశముంటుందని రియల్‌ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు.

రాత్రికి రాత్రే ధరలు పెంచే పరిస్థితులుండవని, చెప్పిన ధర కంటే కాస్త తగ్గించే అవకాశముంటుందని, డబ్బు చెల్లింపులకు కొంత సమయం ఇచ్చేది కూడా ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు స్తబ్దుగా ఉందంటే, భవిష్యత్తులో ఒక్కసారిగా పెరిగే అవకాశముంటుందని, అలాంటి పరిస్థితులు రాకముందే స్థిరాస్తి కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

ఇల్లు కొంటున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు - Tips to Avoid Real Estate Scams

రాజీపడి అస్సలు కొనొద్దు :ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, ఈ ఏడాది ఆఖరు, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న నివాసాలు ఉన్నాయి. వీటి ధరలు గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. అందుకే బిల్డర్లు ఆఫర్లు ఇస్తున్నారు. కొనేటప్పుడు చెరువు ఎఫ్​టీఎల్, బఫర్‌ జోన్లలో లేకుండా అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి విషయంలోనూ రాజీపడొద్దు.

అప్పుడు అవకాశాలను వదులుకున్నారు : ఫ్లాట్, విల్లాలు మాత్రమే కాకుండా వెంచర్లలో స్థలాల కొనుగోలుకు ఇది మంచి సమయమని అంటున్నారు. ప్రభుత్వం కొత్తగా ఎక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేయబోతుంది? భవిష్యత్తులో వృద్ధికి ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుని, అనుభవజ్ఞుల సలహాలతో కొనుగోలు చేస్తే మంచిది. ఒక పదేళ్ల క్రితం ఓఆర్ఆర్ దగ్గర స్థలాలు అంటే అంత దూరమా, ఏం సదుపాయాలు ఉండవని చాలా మంది అవకాశాలను వదులుకున్నారు. కానీ ఇప్పుడు ఔటర్ లోపల కొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఓఆర్ఆర్ బయట అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.

అవసరాల దృష్ట్యా ధరలు పెరిగే అవకాశం : హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం వచ్చే దశాబ్దంలో మరింత విస్తరిస్తుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా, క్రెడాయ్‌ అంచనా వేశాయి. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్ మార్కెట్‌ పరిమాణం 482 బిలియన్‌ డాలర్లుగా, ఆర్థిక వ్యవస్థలో 7.3 శాతం వాటా కలిగి ఉంది. పదేళ్లలో అంటే 2034 నాటికి 10.5 శాతం వాటాతో 1.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే మున్ముందు ఇళ్ల నిర్మాణానికి, కార్యాలయాలకు, అతిథ్య రంగం, రిటైల్‌ రంగాల్లోని నిర్మాణాలకు, వీటికి అవసరమైన భూములకు భారీ డిమాండ్‌ పెరుగుతుందని నివేదికలో స్పష్టం చేసింది. జనాభా పెరగడం, నగరానికి వలసలు, ఆదాయాలు పెరగడం వంటివన్నీ కూడా దీని వృద్ధికి తోడ్పడనున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొనాలా? వద్దా? అనే ప్రశ్న లేకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్తబ్దుగా ధరలు :హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొంతకాలం మార్కెట్‌ స్తబ్దుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం 2000 సంవత్సరం నుంచి గమనిస్తున్నామని క్రెడాయ్ జాతీయ కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ రాంచంద్రారెడ్డి అన్నారు. 2005లో, తెలంగాణ ఉద్యమ సమయంలో, కొవిడ్‌ సమయంలో మార్కెట్‌ తగ్గి, కొంతకాలం స్తబ్దుగా ఉన్నా, ఆ తర్వాత ఒక్కసారిగా ధరలు పెరిగాయని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో బాగా పుంజుకునే అవకాశం ఉందని, స్థిరాస్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని, ఇప్పుడే కొనుగోలు చేయడం మేలని చెబుతున్నారు.

అధిక లాభాలు అనగానే ఆకర్షితులవుతున్నారు - దాచుకున్నంత సొమ్మంతా మోసగాళ్లకు అప్పజెప్పేస్తున్నారు - Real Estate Scams in Telangana

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ - ఆ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొంటే భవిష్యత్తు బంగారమేనట! - Real Estate Business in Hyderabad

ABOUT THE AUTHOR

...view details