Praneeth Rao Phone Tapping Case Update : స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. సుమారు నాలుగేళ్లపాటు ఎస్‌ఐబీలో పనిచేసిన ప్రణీత్‌రావును ఇటీవలి బదిలీల్లో సిరిసిల్ల డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. ఆయన పనిచేసే విభాగంలోని పలు ఆధారాల ధ్వంసం కేసులో ప్రణీత్‌రావుపై (Former DSP Praneet Rao) సస్పెన్షన్ వేటుతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కూడిన క్రిమినల్ కేసు పంజాగుట్ట పోలీసులునమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారమూ విస్తృతంగా సాగింది.
SIB Evidence Destruction Case News :కేసు దర్యాప్తు క్రమంలో ఆయన్ని విచారిస్తే ఇంకా ఎవరి పేర్లయినా బయటికి వస్తాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ప్రణీత్‌రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. ఆ విభాగం తొలుత ప్రధాన ఇంటెలిజెన్స్‌లోని సీఐసెల్ పర్యవేక్షణలో ఉండేది. ఆ తర్వాత దాన్ని దాదాపు పదేళ్ల క్రితమే ఎస్‌ఐబీకి మార్చారు. అప్పటి నుంచి బేగంపేట నుంచి పనిచేస్తున్న ఆ విభాగంలోనికి 2018లో వచ్చిన ప్రణీత్‌రావు ఇటీవలి కాలం వరకు అక్కడే కొనసాగారు. సాధారణంగా ఎస్‌ఐబీలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన కార్యాచరణ మాత్రమే కొనసాగుతుంది.
ప్రణీత్‌రావు బృందం మాత్రం అందుకు భిన్నమైన పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి కదలికలపై నిఘా ఉంచడాన్నే ఈ బృందం పనిగా పెట్టుకొందనే ఆరోపణలున్నాయి. ఎస్ఐబీలో పలు విభాగాలున్నా కేవలం ప్రణీత్‌కు మాత్రమే ప్రత్యేక అధికారాలు కల్పించినట్లు తెలుస్తుంది. ఆయనకు రెండు గదులను కేటాయించడం సహా ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.