Praneeth Rao Statement in Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బహిర్గతమైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాగ్మూలంలో పలు కీలక విషయాలు పోలీసులకు వివరించాడు. ఎస్ఐబీకి 2019లో బదిలీ అయ్యానని తెలిపారు. అక్కడ ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను తనకు అందించారని చెప్పారు.
ఎస్ఐబీలో రోజువారీ కార్యకలాపాలు కాకుండా ఎవరికీ చెప్పని పనులు తనకు చెప్పేవారని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో మొదటి అంతస్తులో ప్రభాకర్‌రావు ఛాంబర్ పక్కనే తనకు రెండు గదులు కేటాయించారన్నారు. ఇందులో ఎస్ఐబీ ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు లాగర్ రూమ్‌లో సుమారు 56 మంది సిబ్బందితో పని చేసినట్లు పోలీసులకు వాంగ్మూలంలో వెల్లడించారు.
సన్నిహితులకు పోస్టింగ్‌లు : ఆ రెండు గదుల్లోని సిబ్బందికి 17 కంప్యూటర్లు, ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్‌రావు తెలిపారు. ముఖ్యంగా ప్రభాకర్‌రావు రాజకీయ సంబంధమైన ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసే పనిని తమకు అప్పగించారన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రొఫైల్స్ క్రియేట్ చేయమని చెప్పేవారని తెలిపారు. ఇందుకోసం స్నేహితుడు, సామాజిక వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్ గుండు వెంకట్రావు, చిన్ననాటి స్నేహితుడు బాలే రవి కిరణ్‌ను కూడా ప్రభాకర్‌రావు సాయంతో ఇంటిలిజెన్స్‌కు బదిలీ చేసుకున్నట్లు చెప్పారు. హెడ్ కానిస్టేబుళ్లు రఫీ, యాదయ్య. కానిస్టేబుళ్లు హరీశ్, సందీప్, మధుకర్ రావు ఉన్నారన్నారు.
ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని వాటి ద్వారా సుమారు 1000 నుంచి 1200 మంది ప్రొఫైల్‌లను క్రియేట్ చేశానని ప్రణీత్‌రావు వెల్లడించారు. అధికారికంగా మూడు, వ్యక్తిగతంగా మరో ఐదు చరవాణులను ఉంచుకొని ప్రభాకర్‌రావు చెప్పిన వారిని ట్రాక్ చేసినట్లు చెప్పారు. 2022లో ప్రభాకర్‌రావు పదవీకాలం ముగియగా తెలంగాణ ప్రభుత్వం అతనని జూన్ 2023వరకు ఎస్ఐబీ చీఫ్‌గా మళ్లీ నియమించిందన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండే వారి ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి వారిని ట్యాప్ చేస్తూ మా బృందంతో కలిసి డబ్బులు సీజ్ చేశామన్నారు.