తెలంగాణ

telangana

ETV Bharat / state

ముమ్మరంగా సాగుతున్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు - Prakasam Barrage Gates Repairs - PRAKASAM BARRAGE GATES REPAIRS

Gates Repair Works in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం, పనుల్ని వేగంగా చేస్తోంది. ఏడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీ కొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తికాగా, ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు.

Prakasam Barrage Works
Gates Repair Works in Prakasam Barrage (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 12:33 PM IST

Prakasam Barrage Works :విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు సహా భారీ పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ రేయింబవళ్లు కొనసాగుతోంది. పనులను చేపట్టిన ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ బెకెమ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏడు రోజుల్లో ఈ ఆపరేషన్​ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం గేట్ల ఏర్పాటు సహా ఇటీవల కొట్టుకుపోయిన పులిచింతల గేటును సమర్థంగా ఏర్పాటు చేసిన అనుభవం బెకెమ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఉంది.

దీంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు, బోట్ల తొలగింపు పనులను ఏపీ ప్రభుత్వం దీనికి అప్పగించింది. అపార అనుభవం కల్గిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఆ సంస్థ సిబ్బంది రేయింబవళ్లు బ్యారేజీపై పనులు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లకు బలంగా ఢీకొనడంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏమాత్రం పనికిరాని విధంగా ధ్వంసం అయ్యాయి. గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69 గేట్ వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

భారీ కట్టర్లు, యంత్రాలతో దెబ్బతిన్న దానిని రెండుగా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న వీటిని భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం గేటును కిందకు దించి ప్రవాహాన్ని నిలిపివేశారు. శుక్రవారం 67వ గేట్ వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్​ను బెకెమ్ ఇన్​ఫ్రా సంస్థ నిపుణులు తొలగించారు. లక్ష క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగానే అనుభవజ్ఞులైన ఇంజినీర్లు బ్యారేజీ గేట్లపై నిలబడి సాహసోపేతంగా ధ్వంసమైన దానిని తొలగించారు. రెండు భారీ క్రేన్లతో బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం 67, 68, 69 గేట్లను కిందకు దింపి దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు.

Collision of Boats in Prakasam Barrage : మరోవైపు బ్యారేజీకి అడ్డుగా వచ్చిన 3 భారీ పడవల తొలగింపు ప్రక్రియను నిపుణులైన ఇంజినీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. గేట్లను ఢీ కొన్న అనంతరం బోల్తా పడి ఉండటం, వాటిలోకి పెద్దఎత్తున ఇసుక, బురద వెళ్లి కూరుకుపోవడంతో కదల్లేదు. దీంతో రెండు వైపులా బలిష్టమైన చైన్లను కట్టి వెయిట్ లిఫ్టింగ్ క్రేన్లతో సిబ్బంది మాన్యువల్ విధానంలో బోట్లను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానంలో అవి మామూలు స్థితికి వస్తే ఎగువన పున్నమి ఘాట్ వైపు నుంచి వాటిని తీసుకువచ్చి లంగర్ వేసి వెనక్కి లాగి తీయనున్నారు.

పడవలు మామూలు స్థితిలోకి రాకపోతే గ్యాస్ కట్టర్లతో కోసి ముక్కలైన భాగాలకు లంగర్లు కట్టి వెనక్కి లాగి తొలగించేలా ఇంజినీర్లు కార్యాచరణను అమలు చేస్తున్నారు. అవి వెనక్కి తీసే క్రమంలో ఎక్కడా అదుపు తప్పి వెనక్కి రాకుండా ఉండేలా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. మధ్య వరకు వెళ్లి అదుపు తప్పి మళ్లీ ముందుకు వచ్చి గేట్లను ఢీ కొంటే అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కడా అలాంటి లోపాలకు తావివ్వకుండా నిపుణులైన ఇంజినీర్లు మార్గదర్శకం చేస్తూ పనులు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం లోపు మూడు పడవలను బయటకు తీయాలని లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, డ్యాం సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

కౌంటర్ వెయిట్ల ఏర్పాటు : మూడు కౌంటర్ వెయిట్లు దెబ్బతినడంతో వాటి స్థానంలో అమర్చేందుకు అధునాతన కౌంటర్ వెయిట్లు తయారయ్యాయి. బెకెమ్ ఇన్​ఫ్రా సంస్థకు చెందిన హైదరాబాద్ వర్క్ షాప్​లో తయారు చేసిన వీటిని విజయవాడకు తరలించారు. గేట్ల ఏర్పాట్లు, నిర్వహణలో అపార అనుభవం ఉన్న నిపుణుడు కన్నయ్య నాయడు ఆదేశాల మేరకు స్టీల్​తో దీనిని రూపొందించారు. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ 17 టన్నులుండగా అంతే బరువు స్టీల్​తో ఈ కౌంటర్ వెయిట్లను 67, 69 గేట్ల వద్ద ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమర్చనున్నారు. బ్యారేజీ గేట్ల వద్ద ఇరుక్కున భారీ పడవలను బయటకు తీశాక వీటి ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. నిపుణులు కన్నయ్య నాయుడు స్వీయ పర్యవేక్షణలో గేట్లు అమర్చే పనులను చేపట్టనున్నారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ప్రవాహం - గేట్లకు అడ్డుపడ్డ 4 బోట్లు - PRAKASHAM BARRAGE GATES OPENED

ABOUT THE AUTHOR

...view details