Power Lifter Spurthi Success Story: చిన్ననాటి నుంచే ఈ అమ్మాయికి క్రీడలంటే అమితమైన ఆసక్తి. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, శిక్షకుడు ఇచ్చిన ధైర్యంతో పవర్‌లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకాలు సాధించింది. అటు చదువుల్లోనూ రాణిస్తూ అందరి ప్రశంసలు, మన్ననలను అందుకుంటుందీ యువ క్రీడాకారిణి.
ఈ యువతి పేరు స్ఫూర్తి. హైదరాబాద్ స్వస్థలం. పాఠశాల స్థాయి నుంచే పలుక్రీడా పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. జిల్లా స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. కరాటేలోనూ శిక్షణ తీసుకుంది. క్రీడల్లో ఆసక్తి ఉన్నా చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం లా చదువుతోంది. మరోవైపు తనకు ఇష్టమైన పవర్ లిఫ్టింగ్‌లోనూ రాణిస్తుంది.
వ్యవసాయ కుటుంబం నుంచి ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థలో పైలట్‌గా మెళకువలు
"నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం. మా పాఠశాల పీటీ టీచర్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను. 8 బంగారు పథకాలు సాధించాను. మా తల్లిదండ్రులు, జిమ్ కోచ్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అంతార్జాతీయ పోటీల్లో పథకాలు సాధించాలి."- స్ఫూర్తి, పవర్ లిఫ్టర్
జిమ్‌లో సాధన చేస్తున్న క్రమంలో ట్రైనర్ వేణు ఈ యువతికున్న శక్తి సామర్థ్యాన్ని గుర్తించాడు. పవర్ లిఫ్టింగ్ గురించి చెప్పి, పాల్గొనమని ధైర్యమిచ్చాడు. దీంతో పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుని 2 సంవత్సరాల నుంచి శిక్షణ తీసుకుంటోంది. న్యూట్రిషనిస్ట్ చెప్పిన ప్రకారం డైట్ తీసుకుంటూ, ప్రతిరోజు జిమ్‌లో సాధన చేస్తోంది. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే పవర్ లిఫ్టింగ్‌పై పట్టుసాధించింది.