Veerabhadra Exports Industry Closed : వైఎస్సార్సీపీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరిట రెండో యూనిట్ ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉందన్న ధీమాతో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగించింది.
ప్రభుత్వం మారడంతో నిర్వహించిన తనిఖీల్లో ఈ పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించి సరిదిద్దుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చింది. అయినా వాటిని లెక్కచేయలేదు. దీంతో ఉత్పత్తి నిలిపివేయమని (క్లోజింగ్ ఆర్డర్) ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో గతంలో ద్వారంపూడి కుటుంబానికే చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలోనూ ఉల్లంఘనలు గుర్తించి ఈ సంవత్సరం ఆగస్టు 6న మూసివేయించారు.