Police Warn Unknown Calls : నేటి కాలంలో సైబర్ నేరాల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజుకో వేషంతో మోసాలకు పాల్పడుతున్నారు. మన అమాయకత్వం, అలక్ష్యాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. ఉద్యోగ ఆఫర్లు, లక్కీ డ్రా, పెట్టుబడి, ఇంటి నుంచే సంపాదన, బహుమతులు గెలిచారని అంటూ బోల్తా కొట్టిస్తున్నారు. మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, చివరకు ఐఏఎస్‌లూ బాధితులుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా +37052529259, +56322553736, +94777 455913, +37127913091, +255901130460 ఇలాంటి నంబర్‌తో ఫోన్ వస్తే ఎత్తరాదని చెప్పారు. ప్రధానంగా +371 (లాత్వియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా), +375 (బెలారస్), +381 (సెర్బియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబర్‌తో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.
తిరిగి ఫోన్ చేస్తే మన మొబైల్లోని కాంటాక్ట్ జాబితాతోపాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా #90 లేదా #09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పారు. అలా చేస్తే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్రపన్నుతున్నట్లుగా గుర్తించాలని పోలీసులు వెల్లడించారు.
మీకూ ఇలాంటి కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే