One rupee Convent at Maharashtra : ఆ పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక్క రూపాయే తీసుకుంటున్నారు. విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్ సహా అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నారు. అదే మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఖుశాల్ ధాక్ ఏర్పాటు చేసిన స్కూలే ఈ 1 రూపాయి కాన్వెంట్.
ఒక రేకుల షెడ్డులో
రహాటే నగర్ టోలీలో ఖుశాల్ ధాక్ పుట్టి పెరిగారు. అక్కడి పరిస్థితుల గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. తన ఏరియాలోని చాలామంది పేద, అణగారిన వర్గాల పిల్లలు ప్రాథమిక విద్యకు దూరం కావడాన్ని చూసి ఖుషాల్ ధాక్ చలించిపోయారు. వారికి ఎలాగైనా స్థానికంగానే అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రాథమిక విద్యను అందించాలని సంకల్పించారు. ఈ సంకల్పం మూడేళ్ల క్రితం సాకారమైంది. రహతే నగర్ టోలీ సెటిల్‌మెంట్‌లోనే నెలకు రూ.3వేలు చొప్పున ఒక రేకుల షెడ్డును ఖుషాల్ అద్దెకు తీసుకున్నారు. అందులో స్థానిక పేద విద్యార్థులకు 1 రూపాయికే అడ్మిషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పాఠశాలలో చేరాక పిల్లలకు నోట్‌బుక్‌లు, పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్ వంటివన్నీ ఉచితంగానే ఖుశాల్ సమకూర్చారు. ఖుశాల్ వేరే ఉద్యోగం చేస్తూ, తనకు వస్తున్న వేతనంలో 70 శాతాన్ని ఈ స్కూలులో చదువుతున్న పేద పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నారు. గత 19 ఏళ్లుగా ఈ మురికివాడలో అక్షరాస్యతను పెంచేందుకు తనవంతుగా ఖుషాల్ కృషి చేస్తున్నారు.
'పేద పిల్లలకు సాయం చేయాలనే'
అసలు ఈ కాన్వెంట్‌ను ప్రారంభించడానికి తాను డబ్బుల గురించి ఎలాంటి ప్రణాళికా వేసుకోలేదని ఖుశాల్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. మురికి వాడలోని పేద పిల్లలకు సాయం చేయాలనే సంకల్పం ఒక్కటే తన మనసులో రగిలిందన్నారు. రహతే నగర్ టోలీ సెటిల్‌మెంట్‌లోని పేద వర్గాల పిల్లలు తన స్కూలులో అడ్మిషన్లు తీసుకునేందుకు అర్చన మాన్కర్ అనే స్థానికురాలు సహాయం చేశారని ఖుశాల్ ధాక్ గుర్తు చేసుకున్నారు.
'ప్రారంభంలో మేం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఉపాధ్యాయులు రహటే నగర్ టోలీ సెటిల్‌మెంట్‌కు రావడానికి ఆసక్తిని వ్యక్తం చేయలేదు. క్రమంగా పరిస్థితి మారింది. ఇప్పుడు మా పాఠశాలకు వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మంచి మనసుతో చేస్తున్న మా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పిల్లలకు చదువు పట్ల అభిరుచి పెరగడం మొదలైంది. మా పాఠశాల పిల్లలు ఇప్పుడు మరాఠీతో పాటు ఇంగ్లిష్‌లోనూ మాట్లాడగలరు, చదవగలరు' అని ఖుశాల్ తెలిపారు.