Kondapochamma Sagar Tragedy : పండగ వేళ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మర్కుర్ మండలం కొండపోచమ్మసాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు డ్యాంలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నీట మునిగి ఐదుగురు మరణించగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన జతిన్, మిర్గానిక్, ధనుష్, లోహిత్ , దినేష్, తాయిలు, మహమ్మద్ ఇబ్రహీం ఏడుగురు వీకెండ్ కావడంతో ఉదయం 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై కొండపోచమ్మ జలాశయం సందర్శనకు వెళ్లారు. ఒక్కొక్కరుగా జలాశయం నీటిలోకి దిగి వారు స్నానాలు చేస్తూ వీడియోలు తీస్తూ జల్సాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలుజారి ఒక్కొక్కరుగా గల్లంతయ్యారు. మహమ్మద్ ఇబ్రహీం, మిర్గానిక్లు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదంలో అన్నదమ్ములు మృతి : చనిపోయిన అన్నదమ్ములైన ధనుష్, లోహిత్ భోలక్‌పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. తండ్రి నర్సింగరావుకు ఫోటో స్టూడియో ఉంది. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. అమ్మాయికి వివాహమైంది. ధనుష్ తండ్రి ఫోటో స్టూడియో చూసుకుంటుండగా, లోహిత్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు.
CM Revanth Respond on Kondapochamma Incident : ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీనిపై కేసీఆర్ స్పందించారు. యువకులు జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని తెలిపారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వివరించారు.మరోవైపు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ఐదుగురు యువకుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తైంది. అక్కడి నుంచి మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు. తమ పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది.
ఈత నేర్పిస్తామని చెప్పి నీట ముంచారు
'నాన్నా.. నాన్నా' అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు - ఇద్దరు కుమార్తెలను కాల్వలోకి తోసిన తండ్రి