Nagastra 1 Drone India : భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. సూసైడ్ డ్రోన్‌గా పిలిచే నాగాస్త్ర-1 భారత్ ఆయుధ సంపదలో వచ్చి చేరింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర-1 లోటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. 75 శాతంపైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసింది. వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే నాగాస్త్రాలను ఆత్మాహుతి డ్రోన్‌గా పేరొంది. GPS ఆధారంగా పని చేసే నాగాస్త్ర-1 కచ్చితత్వంతో దాడి చేయగలదు. తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్ దాదాపు 4,500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. దాదాపు గంటసేపు ఈ నాగాస్త్ర డ్రోన్లు గాల్లో చక్కర్లు కొట్టగలవు. రాడార్లకు దొరక్కుండా దాడులు చేయగలడం వీటి ప్రత్యేకత. రాత్రి వేళల్లోనూ ఇవి కచ్చితత్వంతో పనిచేయగలవు.
అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే నాగాస్త్ర డ్రోన్లు మరింత మెరుగైనవని భారత సైన్యం తెలిపింది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్‌ను మధ్యలో రద్దు చేసినా వీటిని తిరిగి వెనక్కి రప్పించవచ్చనని వెల్లడించింది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా ఉంటుందని పేర్కొంది. భవిష్యత్తులో నాగాస్త్ర-2, నాగాస్త్ర-3 పేరుతో వీటి నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ల తయారీపై సోలార్ ఇండస్ట్రీస్ పనిచేస్తున్నాయని తెలిపింది. అలాగే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్-MALE డ్రోన్లను అభివృద్ధి చేసే దిశగా రక్షణ దళాలు.. ప్రయత్నాలు చేస్తున్నాయి. 3 వేల నుంచి 9 వేల మీటర్ల ఎత్తులో MALE డ్రోన్లు ఎగరగలవు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా 97 MALE డ్రోన్లను అందుబాటులో పెట్టుకోవాలని సైన్యం భావిస్తోంది.