Minister Lokesh About Notice to Teachers On Apar Issue : వైఎస్సార్ జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వీటిని జారీ చేశారు. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేదని కడప జిల్లా విద్యాధికారి నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సాంకేతిక సమస్యకు తాము ఎలా బాధ్యులవుతామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కసారిగా ఉపాధ్యాయ సంఘం నాయకులు కంగుతిన్నారు. ఈ మేరకు జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ రామ్ గోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని స్వయంగా కలిసి నోటీసుల గురించి ఆరా తీశారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా 829 మందికి నోటీసులు ఎలా ఇస్తారని ఆ అధికారిని ప్రశ్నించారు. నోటీసులను నిలుపుదల చేయాలని డీఈఓను కోరారు. ఈ మేరకు నోటీసులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తానని ఎమ్మెల్సీ డీఈవోను కోరారు.
విద్యార్థుల అకడమిక్ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా 'అపార్'
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అపార్’కు సంబంధించి వివరాల నమోదులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సత్వరమే చొరవ చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విన్నవించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన విద్యాశాఖ మంత్రిని కలిసి సమస్యపై చర్చించారు. కనీసం 35 శాతం మంది విద్యార్థుల పేరు, జనన తేదీల మార్పుల సమస్య అధికంగా ఉందన్నారు.
వాటి కోసం కనీసం నాలుగైదుసార్లు పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని, ఒక్కో విద్యార్థికి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారని చెప్పారు. సోమవారం బెళుగుప్ప మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో పని చేస్తున్న మహిళలతో తాను మాట్లాడినపుడు ఈ విషయాన్ని ప్రస్తావించారని వివరించారు. అపార్ నమోదులో సమస్యల పరిష్కారానికి మరింత సులభ మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనికి మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు కేశవ్ వివరించారు.