Youngest Pilot Karnataka Girl : కర్ణాటకకు చెందిన ఓ యువతి 18 ఏళ్లకే పైలట్‌గా మారింది. ఇటీవల కమర్షియల్ పైలట్ లైసెన్స్(సీపీఎల్) పొందింది. దీంతో రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కురాలైన పైలట్‌గా గుర్తింపు తెచ్చుకుంది సమైరా హుల్లూర్. దేశంలోని యంగెస్ట్ పైలట్స్‌లో ఒకరిగా నిలిచింది. సమైరా సాధించిన విజయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విజయపుర జిల్లా కేంద్రానికి చెందిన అమీన్ హుల్లూర్ కుమార్తె అయిన సమైరా హుల్లూర్ తన ప్రైమరీ, సెకండరీ, అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్‌ను నగరంలోనే పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనే పట్టుదలతో ఉండేది. అందుకు గాను పీయూసీ సెకెండ్ ఇయర్ (ఇంటర్మీడియట్) పూర్తైన వెంటనే దిల్లీ వెళ్లిపోయింది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్వహించిన పరీక్షలను రాసింది.
ఒకేసారి ఐదు పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించింది. కానీ మరో ఎగ్జామ్ రాసేందుకు నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండాల్సి ఉంది. ఇంతలో కాన్వార్ వెళ్లి ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత రాయాల్సిన ఒక్క పరీక్ష కూడా రాసి పాసైంది. అనంతరం కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందింది. తద్వారా 18 ఏళ్లకే పైలట్‌గా మారింది. 25 ఏళ్లకే పైలట్‌గా మారిన కెప్టెన్ తపేశ్ కుమార్ తనకు స్ఫూర్తి అని చెబుతోంది.
"రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయసు గల పైలట్‌గా రికార్డు సృష్టించా. కర్ణాటకలో సీపీఎల్‌ను పొందిన అతి పిన్న వయస్కురాలిని నేనే. పైలట్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. అనుకున్నది సాధించాను. నా విజయానికి పట్ల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు"
- సమైరా, పైలట్
"నా కుమార్తె పీయూసీ పరీక్షలు రాయడానికి ముందే డీజీసీఏ పరీక్షలు రాయడానికి అర్హత సాధించింది. ఆమె ఒకే ప్రయత్నంలో ఐదు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. వయోపరిమితి వల్ల ఒక పరీక్ష పెండింగ్‌లో ఉండిపోయింది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత అందులో కూడా పాసైంది. 200 గంటలపాటు ఫ్లయింగ్ జర్నీ ట్రైనింగ్ పొందింది. ఆమె విజయం పట్ల చాలా గర్వంగా ఉంది" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు సమైరా తండ్రి అమీన్ హుల్లూర్.