CM Chandrababu Chit Chat with Media: అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవటం దేశ చరిత్రలోనే లేదని సీఎం చంద్రబాబు విస‌్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై ఏం చేయాలో అధ్యయనం చెయ్యాలని అధికారులకు సూచించారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టేలా చర్యలుండాలని చెప్పారు. అన్నివైపుల నుంచి ప్రజల కోణంలో మంచి ఏదనేది బేరీజు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. సమస్యలన్నింటినీ సావధానంగా విన్న చంద్రబాబు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు: ప్రజాసమస్యల పరిష్కారం దిశగా చేపడుతున్న కార్యక్రమాలను సీఎం పంచుకున్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందాలనే ఉద్దేశంతో చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?
వాట్సప్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయటానికి వాట్సప్ ద్వారా నమోదు పద్ధతి పెట్టామని సీఎం తెలిపారు. అందులో రిజిస్టర్ చేయగానే ఐవీఆర్ఎస్ ద్వారా మెసేజ్ వెళ్తుందన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిందో లేదో తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల తుపాను వచ్చినప్పుడు రైతుల మీద భారం పడకుండా రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించి మిల్లులకు పంపినట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాన్ని నిందించటం సహజమేనన్న సీఎం, తాము మాత్రం పరిష్కారాలు చూపిస్తామని పేర్కొన్నారు.
అధికారుల్లో నిర్లక్ష్య వైఖరి: అవినీతి గురించి విన్నాం కానీ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలు బలవంతంగా లాక్కోవటం ఇప్పుడే చూస్తున్నానని సీఎం అన్నారు. కాకినాడ పోర్టు, సెజ్‌లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో సీఎం చూడాలన్నారు. భూ వివాదాల ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని వీటికి అధికారులు పరిష్కారం చూపకుండా తన సీటు నుంచి వేరొకరికి బదిలీ చేయటమే పరిష్కారం అనుకోవటం సరికాదని హితవు పలికారు. కొంతమంది అధికారుల్లోనూ నిర్లక్ష్య వైఖరి వచ్చిందని సీఎం విమర్శించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదు పరిష్కరించాలన్నదే తమ తపన అని స్పష్టం చేశారు.
'ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు మనల్ని పాలించింది' - జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఇకపై MSMEలు! వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ప్రెన్యూర్పై సీఎం సమీక్ష