మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు - RTC DRIVER MET MINISTER LOKESH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2024, 5:27 PM IST
Tuni RTC Depot Driver Met Minister Lokesh : విధి నిర్వహణలో ఉండగా దేవర సినిమాలోని పాటకు డ్యాన్సు చేసి సస్పెన్షన్‌కు గురైన కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దు చేయించి, విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యలో ట్రాక్టర్ అడ్డురావడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు దేవర సినిమా పాటకు లోవరాజు డ్యాన్స్ వేశారు.
డ్యాన్సు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఆ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోవరాజు కుటుంబంతో సహా మంత్రిని కలిశారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న లోకేశ్ అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.