Police Detain Former MLA Patnam Narender Reddy : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులపై దాడి ఘటనలో కుట్ర ఉందనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేందుకు కేటీఆర్ సహా పార్టీ ఇతర నేతల ఆదేశాలతో వ్యూహ రచన జరిపామని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రధాన నిందితుడు సురేశ్‌తో తరచూ ఫోన్ మాట్లాడినట్లు అంగీకరించారని వివరించారు. సాయంత్రం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఈనెల 27వరకు 14 రోజుల రిమాండ్ విధించారు.
అంతకుముందు వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో 3 గంటల పాటు ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి విచారించారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల దృష్ట్యా వికారాబాద్ శిక్షణా కేంద్రం నుంచి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిగి పోలీస్‌స్టేషన్లో మరింత సమాచారం సేకరించిన అనంతరం కొడంగల్‌కు భారీ బందోస్తు మధ్య నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు 21మందిని అరెస్టు చేశారు.
లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో పోలీసుల కీలక అంశాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, కడా అధికారి వెంకట్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. సురేష్ అనే వ్యక్తి అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడన్న పోలీసులు ఇదే సమయంలో వారిపై దాడి సహా వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించిన పోలీసులు, దాడిలో ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ రిపోర్టులో 46మందిని నిందితులుగా పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న వారిలో 19 మందికి భూమే లేదని ఐజీ సత్యనారాయణ తెలిపారు.