Prakasam Barrage Gates Damage Case :ఏపీలోనిప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన ఘటనపై అనుమానాలున్నాయంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నిమ‌్మల రామానాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని నిగ్గు తేల్చాలంటూ ఇరిగేషన్ అధికారులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.
ఈనెల 1న తెల్లవారుజామున మొత్తం 5 పడవలు బ్యారేజీ గేట్ల వద్దకు వచ్చాయని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. వాటిలో చిన్న పడవ బ్యారేజీ గేటు దాటి వెళ్లిపోయిందని మరో నాలుగు గేట్ల వద్ద ఉన్నాయన్నారు. వీటిలో మూడు భారీ మర పడవలు ఉన్నాయని చెప్పారు. వీటితోనే నదిలో ఇసుకను తోడుతుంటారని తెలిపారు. అందులోని మూడు పడవలు గేట్లను తగిలి గట్టిగా ఢీ కొట్టడంతో మూడు కౌంటర్ వెయిట్ దిమ్మెలు ధ్వంసమైనట్లు ఫిర్యాదులు వివరించారు.
అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ సమయంలో బ్యారేజీపై విధుల్లో ఎవరున్నారు? అనే విషయాలను పోలీసులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మూడు పడవలు గొల్లపూడి, సూరాయపాలెం వ్యక్తులకు చెందినట్లు సమాచారం. పడవలపై వైఎస్సార్సీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు పడవలు వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ అనుచరులవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.