తెలంగాణ

telangana

ETV Bharat / state

కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటి వరకు 90కి పైగా సర్జరీలు - మరో 2 ఆసుపత్రులపై పోలీసుల దృష్టి - ALAKNANDA HOSPITAL KIDNEY CASE

అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ ఘటనపై విచారణ - అలకనందలో 20 సర్జరీలు - మొత్తం వివిధ ఆసుపత్రుల్లో 90కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు - 9 మంది అరెస్ట్

kidney Racket Case
Alaknanda Hospital kidney Racket Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2025, 1:41 PM IST

Updated : Jan 25, 2025, 5:29 PM IST

Alaknanda Hospital kidney Racket Case :రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుట్టుచప్పుడు కాకుండా పేదలే లక్ష్యంగా ఇప్పటివరకు ఆస్పత్రిలో 20కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

త్వరలో ఆ ఆసుపత్రులకు తాళాలు! : మరోపక్క మొత్తం వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న సుమంత్‌, అవినాశ్, ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 90కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్లు తెలుస్తోంది. కిడ్నీ దాతలకు రూ.4 నుంచి 5 లక్షలు ఇస్తూ గ్రహీతల వద్ద రూ.50 నుంచి 60 లక్షల వరకు వసూలు చేస్తూ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలోనే మరో రెండు ఆస్పత్రులను కూడా పోలీసులు సీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

పరారీలో మరో కీలక నిందితుడు : అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఇప్పటివరకు అవినాష్, సుమంత్, ప్రదీప్, సూరజ్ మిశ్రా, గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలను అరెస్టు చేశారు. ఈ 9 మందిలో ఇప్పటికే ఆసుపత్రి ఛైర్మన్ సుమంత్, రిసెప్షనిస్ట్ గోపీలను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు పంపించారు. ఈ రాకెట్‌లో జనరల్‌ సర్జన్ అవినాశ్, అలకనంద ఛైర్మన్ సుమంత్ సూత్రధారులుగా ఉన్నారు. వైద్యులు, పేషంట్లను తీసుకురావడంలో ప్రముఖపాత్ర పోషించిన పవన్ పరారీలో ఉన్నాడని అతను మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

2022లో ఈ అవినాశ్ జనని, అరుణ అనే రెండు ఆస్పత్రులను నడిపించాడు. జనని ఆస్పత్రిని ఇతరులకు విక్రయిద్దామనుకుంటున్న క్రమంలో డాక్టర్ అవినాశ్‌కు లక్ష్మణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తూ డబ్బు సంపాదించొచ్చని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఈ దందాలోకి దిగిన అవినాశ్ తాను నిర్వహిస్తున్న అరుణ ఆస్పత్రిలో 4 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, జనని ఆస్పత్రిలో మరికొన్ని చేశాడు. అనంతరం సుమంత్‌తో కలిసి సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో ఈ అక్రమ దందాను కొనసాగించారు. ఆస్పత్రి ఏర్పాటు చేశాక గడిచిన ఆరు నెలల నుంచి దాదాపు 20కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాతలు, గ్రహీతలు అంతా అంతర్రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

కజికిస్థాన్‌లో ఎంబీబీఎస్ :కజికిస్థాన్‌లో ఎంబీబీఎస్ చేసిన సుమంత్ ఏడు నెలలక్రితం హైదరాబాద్‌లో అలకనందా అసుపత్రిని ప్రారంభించారు. తొలుత 50 పడకల ఆసుపత్రి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో కేవలం తొమ్మిది పడకలకే అనుమతి వచ్చింది. స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతి లభించగా మల్టీస్పెషాలిటీ అని పేరు పెట్టుకొని నిర్వహిస్తున్నట్లు తేలింది.

"హైదరాబాద్‌ వచ్చి ఈ అక్రమ దందా చేస్తున్నట్లు గుర్తించాం. అలకనంద ఆస్పత్రిలో 20 కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. నిందితులు ప్రదీప్, మిశ్రా, గోపి, రవి, రవీందర్, హరీష్, సాయి అరెస్టు చేశాం. కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసేలా అవినాష్‌కు లక్ష్మణ్ సలహా ఇచ్చాడు. దాతలకు రూ.5 లక్షలు ఇచ్చి మిగతాది పంచుకోవచ్చని చెప్పాడు. ఇంకా కొందరు నిందితులు, దాతలు, గ్రహీతలను గుర్తించాల్సి ఉంది" -సుధీర్ బాబు, రాచకొండ సీపీ

ఆ దాత వయస్సు 22 మాత్రమే : ఈనెల 21న ఎల్బీనగర్ ఏసీపీ క్రిష్ణయ్య నేతృత్వంలో అలకనంద ఆసుపత్రిలో సోదాలు చేసిన పోలీసులు తమిళనాడుకు చెందిన ఇద్దరు దాతలు నస్రీన్, ఫిర్దోస్‌ బెంగళూరుకు చెందిన ఇద్దరు గ్రహీతలు రాజశేఖర్, భట్ ప్రభులను గుర్తించారు. అప్పటికే వారికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఆ నలుగురిని వెంటనే గాంధీకి తరలించి అలకనంద ఆసుపత్రిని సీజ్‌ చేశారు. కిడ్నీ దాతల్లో ఒకరైన నస్రీన్ వయస్సు 22 ఏళ్లు మాత్రమే. నిందితుల నుంచి 5లక్షల రూపాయల నగదు, ఓ కారు, పది ఫోన్లు, ఆపరేషన్‌కు ఉపయోగించే సర్జికల్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడు గ్యాంగ్​ కోసం వేట : పరారీలో ఉన్న వారిలో తమిళనాడుకు చెందిన సర్జన్ రాజశేఖర్, జమ్ముకశ్మీర్‌కు చెందిన సర్జన్ సోహిబ్ ఉన్నారు. అలాగే వైజాగ్‌కు చెందిన ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్ మధ్యవర్తులు కర్ణాటకకు చెందిన పొన్నుస్వామి ప్రదీప్, సురజ్ మిశ్రా, తమిళనాడుకు చెందిన శంకర్ ఉన్నారు. వీళ్లకోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని త్వరలోనే పట్టుకుంటామని సీపీ వెల్లడించారు. ఈ కేసులో మరింతమంది నిందితులు, కిడ్నీ దాతలు, గ్రహీతల్ని గుర్తించాల్సి ఉందని తెలిపారు.

అరెస్టు చేసిన వారందరినీ మరోసారి విచారించేందుకు త్వరలోనే పోలీసులు కస్టడీకి కోరనున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్న మరో రెండు ఆస్పత్రులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాటిపై కూడా దాడులు చేసి సీజ్‌ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సీఐడీ చేతికి అలకనంద కిడ్నీ రాకెట్ కేసు - ఆసుపత్రి ఛైర్మన్‌ సహా ఇద్దరి అరెస్ట్

మిస్టరీగా అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ - కేసు సీఐడీకి బదిలీ?

Last Updated : Jan 25, 2025, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details