Police Nab 175 crore Rupees Cyber Fraudsters : ఓ సైబర్ నేరస్థుల ముఠా కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ.175 కోట్లు కాజేసింది. ఈ సొమ్మును ఆరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్‌సీఆర్‌పీ)కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లోని బ్యాంకు ఖాతాల్లోకి ఈ సొమ్మును మళ్లించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ఖాతాదారుల గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకరంగా అవి ఆటోడ్రైవర్లవని బయటపడింది.
వారిని విచారించగా సైబర్ ముఠాలో ఇద్దరు కీలక నిందితులు చిక్కారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కూపీలాగితే ముఠా ప్రధాన నేరస్థుడు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తేలింది. అతన్ని పట్టుకుంటే ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ప్రమేయముందో తెలుస్తుందని టీజీసీఎస్‌బీ పోలీసులు భావిస్తున్నారు. ఈ సైబర్ మోసాల వెనుక చైనా ముఠా హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మామూలుగా పెద్దఎత్తున లావాదేవీలు చేసే వ్యాపార సంస్థలకే కరెంటు ఎకౌంట్ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే సేవింగ్స్ ఖాతాలతో పోల్చితే వీటిల్లో రోజూ భారీగా నగదు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
రెండు నెలల్లో 600 మంది నుంచి : సైబర్‌నేరాల ద్వారా వచ్చే సొమ్మును త్వరగా తీసుకునేందుకు ముఠాలు కరెంట్ ఖాతాలను తెరవడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌లో ఉంటున్న ప్రధాన నిందితుడు ఈ బాధ్యతను హైదరాబాద్‌లోని విజయ్‌నగర్‌కాలనీకి చెందిన మహ్మద్ సోయబ్ తాఖీర్(34), మొఘల్‌పురాకు చెందిన మహ్మద్‌బిన్ అహ్మద్ బవజీర్(49)కు అప్పగించాడు. వీరిద్దరు రోజువారీ కూలీలు, ఆటోడ్రైవర్లు. ఇలాంటి వారిని బురిడీ కొట్టించి వారితో కరెంటు ఖాతాలను తెరిపించేవారు. అలా ఎస్‌బీఐ శంషీర్‌గంజ్ బ్రాంచిలో గత ఫిబ్రవరిలో ఆరు ఖాతాలు తెరిపించారు. మార్చి, ఏప్రిల్‌లో సుమారు 600 మంది సైబర్ బాధితుల నుంచి కొల్లగొట్టిన రూ.175 కోట్ల సొమ్మును వీటిల్లోకి చేరింది.