PM Surya Ghar Scheme Problems in Telangana :ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'పీఎం సూర్యఘర్' పథకానికి రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం ఈ పథకానికి భారీ ఎత్తున రాయితీ ప్రకటించడంతో ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్లో లక్షా 8 వేల 201 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 62,260 మంది, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 45,941 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ల అనంతరం దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. అందులో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 8,431 మంది దరఖాస్తులు చేసుకోగా అందులో 3,022 మంది ఫీజుబులిటి పొందారు. వాటిలో కేవలం 1,451 మందికి సోలార్ బిగింపు ప్రక్రియ పూర్తిచేశారు. మరో 1,561 మంది పనులు పూర్తిచేయాల్సి ఉంది. టీజీఎన్పీడీసీఎల్లో రిజిస్ట్రేషన్ల అనంతరం 3,950 దరఖాస్తు చేసుకోగా అందులో ఎంపికైన 862 మంది ఫీజుబులిటీ సాధించారు. వీటిలో 236 మందికి సోలార్ బిగింపు ప్రక్రియ పూర్తిచేశారు. మరో 586 మంది పనులు పూర్తిచేయాల్సి ఉంది.
రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న జాతీయ బ్యాంకులు : పీఎం సూర్యఘర్ పథకానికి రుణాలు అందించేందుకు దాదాపు అన్నీ జాతీయ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 3కిలోవాట్ వరకు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా, ఎలాంటి గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డ్ తీసుకెళితే బ్యాంకులు 7శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద మూడు కిలోవాట్ల వరకు రూ. 78,000 వరకు కేంద్రం రాయితీ అందజేస్తుంది. బ్యాంకులు సైతం ఈ రాయితీని మినహాయించుకుని 5 ఏళ్లలోపు సులభ వాయిదాల పద్ధతిలో కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాయి.