Phone Calls To Unemployed ANMS As Health Officials :నిరుద్యోగ ఏఎన్ఎంలకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అవతలి వ్యక్తి కాల్ చేసి మాకు 12.30 గంటల్లోగా డబ్బులను పంపిస్తే ఆ జాబ్ మీకే కేటాయిస్తాం. తాము చెప్పే నెంబర్‌కు ముందు రూ.10వేలు పంపండి అని సూచిస్తున్నారు. నియామక ఉత్తర్వులను తీసుకున్నాక మిగిలిన రూ.2.90లక్షలు ఇవ్వాలి అని చెబుతున్నారు. నెలకు 29,120 పే స్కేలుతో కూడిన వేతనం వస్తుందంటూ నిరుద్యోగ ఏఎన్ఎంలకు గుర్తుతెలియని కాల్స్ వస్తున్నాయని తెలిసింది. మంగళవారం జిల్లాలో సుమారు 11 మంది నిరుద్యోగ ఏఎన్ఎంలకు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకరు ఆ వ్యక్తి మాటలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి నియామకప్రక్రియలో హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో ఎన్‌హెచ్‌ఎం స్టాఫ్‌నర్సుల పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు డీఎంహెచ్‌వో అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నియామక ప్రక్రియను చేపట్టాలనుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేపట్టినటువంటి స్టాఫ్‌నర్సు నియామకాల సమయంలో వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ అభ్యర్థులను గుర్తించి ఉద్యోగం ఇవ్వాలా? లేక నోటిఫికేషన్ ఇవ్వాలా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
మార్కులు కలుపుతాం : మంగళవారం హైదరాబాద్ ఎన్‌హెచ్‌ఎం కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ కొంతమందికి ఫోన్లు వచ్చాయి. తాను ఎన్‌సీడీ కౌన్సిలర్ సుమలత పీఏ శివ అంటూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంకు ఉదయం 11.30 గంటల సమయంలో ఫోన్ చేశారు. మీకు మెరిట్ తక్కువగా ఉంది. 74 మార్కులే వచ్చాయి. మీరు 12.30 గంటల్లోగా రూ.10 వేలు పంపించినట్లయితే మరిన్ని మార్కులు కలిపి జాబితాలో చేర్చుతాం. వచ్చే శనివారం ధ్రువపత్రాల పరిశీలన(సర్టిఫికెట్ వెరిఫికేషన్) ఉంటుంది. నియామక ఉత్తర్వులు తీసుకున్నాక మిగిలిన రూ.2.90 లక్షలు ఇవ్వాలని ఆమెతో అన్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొదంటూ నమ్మబలికాడు.