Pawan Kalyan Proposed Chandrababu as CM Candidate :టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Chandrababu Elected as TDLP Leader :గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు.
శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతాం :టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచారని, 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీయే కూటమి దక్కించుకుందని గుర్తు చేశారు. ఇది అద్భుతమైన విజయమని, ఎన్డీయే కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలో చెప్పానని, అదే మాటపై నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని, సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పామని స్పష్టం చేశారు.