Fake Ayurvedic Medicine Sales : ఆయుర్వేదంతో తయారు చేసిన మందులకు ఉన్న డిమాండ్‌ను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నకిలీ పేర్లతో బ్రాండులు సృష్టించి, ఆయుర్వేదంతో తయారుచేసిన మందులంటూ విక్రయిస్తున్నారు. కొంచెం చూర్ణం నోటిలో వేసుకుంటే, వెంటనే మధుమేహం(షుగర్) నియంత్రణలోకి వస్తుంది. ఆ పౌడరు నీటిలో కలుపుకొని తాగితే ఆ రోజే వెంటనే కిడ్నీల్లో రాళ్లు అమాంతంగా కరిగి పోతాయని ఇలా అబద్ధాలను చెబుతూ నకిలీ మందులను విక్రయిస్తున్నారు.
నగరంతో పాటు మారుమూల పల్లెల్లోనూ ఈ మందులను జోరుగా తిరిగి అమ్మకాలు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ అధికారుల(డీసీఏ) ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో డీసీఏ అధికారులు ప్రణాళికతో మెరుపు దాడులు చేసి, నకిలీ ఆయుర్వేద మందులను స్వాధీన పర్చుకున్నారు. వాటిని విక్రయిస్తున్న వారందరిపై వెంటనే పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఐసోటిన్ ప్లస్ ఐ డ్రాప్స్, ఉత్తరేణి చూర్ణం, డెస్టోన్ ట్యాబ్లెట్లు, ఐకేర్‌ఐ ఆయింట్‌మెంట్, మధురికత పౌడర్, స్టోనాట్ వంటి తదితర పేర్లతో నకిలీ మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఆరోగ్యం సంగతి ఇక అంతే : ఆయుర్వేదంపై ఇప్పటికీ చాలా మందికి నమ్మకం ఉంది. కానీ అవి అసలైనవా? నకిలీవా? అని గుర్తించడంలో సమస్య ఏర్పడుతుంది. ఇదే దళారులకు ఆయుధం అయ్యింది. వారు చెప్పింది నమ్మి సులువుగా నకిలీ మందుల బారిన పడుతున్నారు. కచ్చితంగా ఈ మందులు వాడితే రోగం నయమవుతుందని, న్యూమోనియా, కిడ్నీల్లో రాళ్లు, మధుమేహం రోగాలను తగ్గిస్తాయని మందుల ప్యాకింగ్‌పై నేరుగా రాసిమరి అమ్ముతున్నారు.