Passengers Facing Problems Due to Bad Condition of Road in NTR District :అది 13 కిలోమీటర్ల రహదారి. కానీ అడుగడుగునా గోతులే దర్శనమిస్తాయి. కంకర తేలి అత్యంత అధ్వానంగా మారింది ఆ రహదారి. పగలే రోడ్డు ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లే ఆ మార్గంలో రాత్రి ప్రయాణమంటే ఇంక హడలే. చీకట్లో కనిపించని ఆ గోతుల్లో వాహనాలు పడ్డాయా ఇక అంతే. వాహనాలు గుల్లవ్వడంతో పాటు ప్రయాణికుల ఒళ్లు హూనం అవుతుంది.
ఇది ఎన్టీఆర్ జిల్లా మైలవరం - నూజివీడు మధ్య రహదారి. కంకర తేలిపోయి నిలువెల్లా గుంతలతో నిండిపోయింది. రహదారి రెండు వైపులా కోతకు గురవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. గోతులమయంగా మారిన రహదారులపై రాకపోకలకు వాహన చోదకులు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
మైలవరం-నూజివీడు మార్గంలో సుమారు 13 కిలోమీటర్ల మేర వాహనాలు కనీస వేగంతో వెళ్లలేని దుస్థితి నెలకొంది.
మైలవరం నుంచి బత్తులగూడెం వరకు పరిస్థితి అధ్వానంగా మారింది. అక్కడి నుంచి నూజివీడు వరకు కాస్త పర్వాలేదు. ఈ మార్గంలోని వెల్వడం హైస్కూల్ వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా తయారవడంతో కొన్నేళ్లుగా ఎన్నో వాహనాలు దిగబడిపోయాయి. గుంతలు పూడ్చి వదిలేశారు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా రోజూ చాలామంది గాయపడుతున్నారు.