Bus Stop Problems In Hyderabad : బస్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రిక్వెస్ట్ స్టాప్లను కూడా డ్రైవర్లు లెక్క చేయట్లేదు. బస్సుల్లో డిజిటల్ చెల్లింపులకు యంత్రాలు అందించారు. అయినా నగదు మాత్రమే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆపాల్సిన స్టేజీలో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రశ్నించే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు మహిళలు డిపోల్లో ఫిర్యాదు చేస్తున్నారు.
కొత్తపేట రైతుబజార్ ఎదురుగా బస్టాప్ :దిల్‌సుఖ్‌నగర్ డిపో బస్సులు నడుపుతున్న మార్గాల్లో ప్రయాణికులు అసంతృప్తితో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మార్గంలో అనేక బస్సులు నడుపుతుండగా రాగన్నగూడ వద్ద బస్సు ఆపడం లేదు. ముఖ్యంగా 277డీ రూట్‌లో ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. కొత్తపేట రైతుబజార్ ఎదురున్న బస్టాప్ మార్గంలో ప్రయాణించే 80 శాతం బస్సులు ఆపడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
గంటల తరబడి వేచి ఉన్నా : మైహోమ్ భూజ ఎదురుగా బయో డైవర్సిటీ బస్టాప్ ఉంది. ప్రధానంగా మధ్యాహ్నం బస్సులు ఆపడం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్నా, కళ్ల ముందే నాలుగైదు బస్సులు వెళ్లిపోయాయి కానీ, ఏ ఒక్కటీ ఇక్కడ ఆగలేదని సాయికుమార్ అనే ప్రయాణికుడు తెలిపారు.