Paddy Procurement Problems in Joint Nizamabad District : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. కానీ అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 433 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 62,449 మంది రైతుల నుంచి 4.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు.
ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యమైంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు. ఆర్మూర్ డివిజన్‌లోని పలు మండలాల్లో ఇంకా సేకరణ మిగిలిపోయింది. దీంతో వర్షాల కారణంగా రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
"గత ఇరవైరోజుల నుంచి నుంచి ధాన్యం కొనడం లేదు. వర్షాలకు పడుతున్నాయి ధాన్యం తడిసిపోతోంది. మళ్లీ తిరిగి ఆరబెట్టాల్సి వస్తోంది. దీనికి తోడూ అధికారులు స్పందించడం లేదు. తేమ శాతం సరిగ్గా లేదని ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. ఇప్పటికేకొనుగోళ్లు చివరి దశకు చేరాయి. ఇప్పటికైనా త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం."- రైతులు
కామారెడ్డి జిల్లాలోనూ ధాన్యం పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఓవైపు కొన్ని మండలాల్లో సేకరణ ఆలస్యం కావడం, మరోవైపు వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కెతున్నారు. నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఐదు రోజులుగా వడ్ల తూకం వేయడం లేదని, సరిపడా లారీలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రెవెన్యూ అధికారులకు జుక్కల్ మండలం ఖండేబల్లూర్ కర్షకులు వినతి పత్రం ఇచ్చారు. సత్వరమే కొనుగోలు చేయకపోతే రోడ్డెక్కి ధర్నా చేస్తామని హెచ్చరించారు.