OU Engineering Students Invented Sewage Monitoring System :మ్యాన్‌హోల్ నిండినా, మురుగునీటిలో హానికర వాయువులు ఉన్నా దాన్ని గుర్తించి సమాచారాన్ని అందించే పరికరాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు. మ్యాన్‌హోళ్లను, ఇతర ట్యాంకులను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు వాటి లోపలికి దిగుతుండడం, హానికర వాయువులను పీల్చి ఒక్కోసారి మరణిస్తున్న ఘటనలు తారసపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కె.శిశికాంత్ విద్యార్థులతో చర్చించి "సీవెజ్ మానిటరింగ్ సిస్టమ్" పేరుతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో పనిచేసే పరికరాన్ని రూపొందించారు.
చండీగఢ్ వేదికగా కొద్దిరోజల క్రితం జరిగిన సస్టైనబుల్ స్మార్ట్ సిటీస్ అంతర్జాతీయ సదస్సులో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. మ్యాన్‌హోల్ లోపల ఈ పరికరాన్ని అమర్చితే పరికరంలోని సెన్సర్లు అందులోని ప్రవాహమట్టాన్ని గుర్తిస్తాయి. మ్యాన్‌హోల్ నిండి పొంగి ప్రవహించే స్థితికి వస్తే, జీపీఎస్, ఐఓటీ సాయంతో జలమండలి అధికారుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపుతుంది. ఇందులోని సెన్సర్ల ద్వారా మీథేన్, హైడ్రోజన్‌సల్ఫైడ్ వాయువుల ఉనికిని గుర్తించి సమాచారం చేరవేస్తాయి. ఈ పరికరం తయారీకి రూ.2500 మాత్రమే ఖర్చయిందని, పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నామని ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.