తెలంగాణ

telangana

ETV Bharat / state

పాస్ అయిన వారు ఫెయిలైనట్లు, ఫెయిల్ అయిన వారు పాసైనట్లు జాబితా - కాలేజీ గుర్తింపు రద్దు - OU CANCELS RECOGNITION OF HMV

విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను తారుమారు చేసిన హిందీ మహావిద్యాలయం - గుర్తించిన ఉస్మానియా స్టాండింగ్‌ కమిటీ - గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ

Osmania University Cancels Recognition of Hindi Mahavidyalaya
Osmania University Cancels Recognition of Hindi Mahavidyalaya (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 5:12 PM IST

Osmania University Cancels Recognition of Hindi Mahavidyalaya :నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల విద్యా ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేసిన కళాశాలపై ఓయూ కఠిన చర్యలు తీసుకుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫెయిలైనట్లుగా, ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తప్పుడు సమాచారాన్ని అందించిన హిందీ మహావిద్యాలయం గుర్తింపును రద్దు చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది.

Osmania University Cancels Recognition of Hindi Mahavidyalaya (ETV Bharat)

2019-2022వ విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ ఆరో సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగా, ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులు ఫెయిలైనట్లుగా తారుమారు చేసిన జాబితాను ఓయూ పరీక్షల నియంత్రణ కార్యాలయానికి హిందీ మహావిద్యాలయం సమర్పించింది. సదరు విద్యాసంస్థ టీఆర్ రికార్డులపై అనుమానం రావటంతో ఓయూ అధికార యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది. మూడు దఫాలుగా హిందీ మహావిద్యాలయ విద్యాసంస్థను సందర్శించిన కమిటీ విస్తుపోయే అంశాలను గుర్తించింది.

నోటిఫికేషన్‌ వివరాలు సమర్పించకపోవడంతో : స్వయంప్రతిపత్తి కలిగిన హిందీ మహావిద్యాలయ్ స్వయంగా పరీక్షల నిర్వహణ, పేపర్ ఎవాల్యూషన్ తమ అధ్యాపకులతోనే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడ్డట్టు కమిటీ గుర్తించింది. కమిటీ విచారణలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు కామర్స్ సమాధాన పత్రాలను దిద్దినట్లుట్లుగా తేలింది. విద్యార్థుల మార్కుల జాబితాలన్నీ ఫోర్జరీ చేసినట్లుగా కమిటీ గుర్తించింది. పరీక్ష పత్రాలు, ఎవాల్యూషన్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కళాశాల యాజమాన్యం కమిటీకి సమర్పించకపోవటం గమనార్హం. యూనివర్శిటీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన కళాశాల నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా కమిటీ అభిప్రాయపడింది.

ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ షార్ట్​ ఫిల్మ్ ఫెస్టివల్ - 'జషన్ ఎ సైన్మా'కు విద్యార్థుల నుంచి విశేష స్పందన - NATIONAL SHORT FILM FESTIVAL at ou

మరో దఫా కళాశాలను సందర్శించిన ఓయూ విచారణ కమిటీ యూజీ 2023-24 బ్యాచ్ టీఆర్ రికార్డుల్లో ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాలు, స్టాంపులు లేనట్లు గుర్తించింది. దీంతో యూనివర్సిటీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు కళాశాల స్వయం ప్రతిపత్తిని అబయన్స్‌లో పెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. తుది నిర్ణయం కోసం వేసిన మరో కమిటీ సైతం అక్టోబర్ 4, 2024న సమగ్ర విచారణ చేపట్టింది.

రికార్డులు తారుమారు : యూనివర్సిటీకి సమర్పించిన 2022 యూజీ 6వ సెమిస్టర్ ఫలితాలు తప్పని, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని విచారణ కమిటీ తేల్చింది. హిందీ మాహావిద్యాలయ యాజమాన్యం 13 మంది బీకాం, 27 మంది బీఎస్సీ, 9 మంది బీబీఏ విద్యార్థులు పాసైనట్లుగా యూనివర్సిటీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు తేలింది. నలుగురు బీకాం, ఒక బీబీఏ విద్యార్థి ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిలైనట్లుగా రికార్డులను తారుమారు చేశారు. ఈ విషయమై వివరణ ఇచ్చిన కళాశాల యాజమాన్యం తమ పరీక్షల విభాగం రికార్టుల్లో పొరపాట్లు జరిగినట్లు స్వయంగా ఒప్పుకుంది. అయినప్పటికీ తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఓయూలో విద్యార్థుల ధర్నా- వీసీ రవీందర్ రాజీనామాకు డిమాండ్

ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఈ విషయమై పదే పదే హెచ్చరించినప్పటికీ హిందీ మహావిద్యాలయం పెద్దగా స్పందించలేదు. దీంతో విచారణ కమిటీల నివేదికలను యూనివర్సిటీ స్థాయి సంఘానికి నివేదించింది. ఈ విషయమై తీవ్రంగా స్పందించిన ఓయూ స్థాయి సంఘం(స్టాండింగ్ కమిటీ) సంబంధిత రికార్డులను సత్వరమే సీజ్ చేయాల్సిందిగా ఓయూ పరీక్షల నియంత్రణాధికారి, డీన్ సీడీసీలను అదేశించింది. ఓయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు గాను క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

వచ్చే సంవత్సరం నుంచి నో యూజీ అడ్మిషన్లు : కళాశాల స్వయంప్రతిపత్తిని రద్దు చేయాల్సిందిగా యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరాలని సిఫార్సు చేసింది. ఓయూ పరిధిలో మరెక్కడా హిందీ మీడియం కళాశాలలు లేనందున విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు మినహాయింపు నిచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం 2025 - 2026 నుంచి ఎలాంటి యూజీ అడ్మిషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది. సాధారణంగా పీజీ తరగతులు నాన్ అటానమస్ స్టేటస్‌తో కొనసాగించుకోవచ్చని తెలిపింది. కానీ తుది సెమిస్టర్ పరీక్షలను స్వయంగా యూనివర్శిటీ నిర్వహించనుంది.

స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఫలితంగా ఎలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చింది. అనుబంధ, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు యూనివర్శిటీ, యూజీసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఈ సందర్భంగా ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం అన్నారు. విద్యా ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఓయూకు హాల్​టికెట్​తో వచ్చిన మంత్రి సీతక్క - Minister Seethakka Write LLM Exam

రూ.10 వేల కోట్ల ఫ్రాడ్! - 'దరువు' చిత్ర నిర్మాత శివరామకృష్ణ మళ్లీ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details