Center For Cellular And Molecular Biology Open Day :హైదరాబాద్ తార్నాకలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ( సీసీఎంబీ)లో 'ఓపెన్ డే' కార్యక్రమం నిర్వహించారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన వివిధ జీవుల జీవకణాలను తయారు చేసే అణువులకు సంబంధించిన జీవావరణ శాస్త్రం-జనాభా స్థాయిల రంగాలపై విద్యార్థులు, సందర్శకులకు అవగాహన కల్పించారు.
సైన్స్‌పై అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు :జీబ్రా ఫిష్, ఫ్రూట్‌ఫ్లై, స్కార్పియన్స్, మిల్లిపెడ్స్, ఎలుకలు, ఈస్ట్, వైరస్ బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులను కూడా శాస్త్రవేత్తలు ఎలా అధ్యయనం చేస్తారో తాము తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. పరీక్షలు జరుగుతున్నప్పటికీ ఓపెన్ డేకి పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. వర్షాలు కురుస్తున్నప్పటికీ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచే కాకుండా సమీప రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా సందర్శకులు తరలివచ్చారు.
"ఈ రోజు సీఎస్‌ఐఆర్ ఫౌండేషన్ డే. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సైన్స్, శాస్త్రీయ దృక్పథం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ ఓపెన్ డే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, సైన్స్‌పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ సీసీఎంబీలో జరిగే పరిశోధనలపట్ల అవగాహన కల్పించాం. విద్యార్థులకు సైన్స్ ప్రాథమిక అంశాలైనటువంటి బ్యాక్టీరియా, ఫంగస్, డీఎన్‌ఏతో పాటు అనేక అంశాలను వివరించాం"-మంజులా రెడ్డి, చీఫ్ సైంటిస్ట్