AP Free Bus Scheme :ఆంధ్రప్రదేశ్లోఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2000ల బస్సులతో పాటు, 11 వేల 500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ఎంత రాబడి తగ్గుతుంది, ఏయే బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను సర్కార్‌కి అందజేశారు.
ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును చూడటంతో పాటు, అధికారులిచ్చిన నివేదికపైనా పరిశీలన చేయనుంది. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున 44 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో పాస్‌హోల్డర్లు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లను కొనుగోలు చేస్తారు. వీరిలో సూపర్‌లగ్జరీ, అల్ట్రాడీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు 3 లక్షల మంది దాకా ఉన్నారు.
మిగిలిన 24 లక్షల మంది పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసు, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసు ప్రయాణికులు. ఈ సర్వీసుల్లోనే రోజుకు ప్రయాణికుల సంఖ్య 10 లక్షల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించేవారిలో 40 శాతం మహిళలు, 60 శాతం పురుషులు ఉంటున్నారు. స్త్రీలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.