Deputy CM Pawan Kalyan Field Visit To Sajjala Estate : వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి తేలుస్తానని ఆయన ప్రకటించారు. పవన్ ప్రకటనతో జిల్లా అధికారులు, వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.
YSR జిల్లా సీకేదిన్నె మండలంలోని సర్వే నెంబర్ 1629లో 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. పక్కనే సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 184 ఎకరాలు పట్టా భూమి ఉంది. ఆ భూముల్లో ఎస్టేట్ నిర్మించి చుట్టూ పెద్దపెద్ద గేట్లు వేసి కంచె నిర్మించారు. ఎస్టేట్ భూముల్లో 42 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పది రోజుల కిందట పవన్ కల్యాణ్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆదేశించారు. ఆరోజు నుంచి అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు సర్వే చేస్తున్నా కొలిక్కిరాలేదు. పరస్పర ఫిర్యాదులతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
అడవిని కలిపేసుకున్న 'సజ్జల ఎస్టేట్' - విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్
స్వయంగా రంగంలోకి దిగుతున్న పవన్ కల్యాణ్: సజ్జల ఎస్టేట్‌లో 42 నుంచి 52 ఎకరాల భూమి అటవీ శాఖదని రెవిన్యూ అధికారులు స్పష్టంగా చెబుతున్నా అటవీశాఖ అధికారులు తమది కాదని సరైన మ్యాపులు, డాక్యుమెంట్లు లేవంటున్నారు. అటవీ సిబ్బంది సర్వే పేరుతో ముందుకు వెళ్లినా తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో తప్పించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కొలిక్కి రానందున స్వయంగా జాయింట్ కలెక్టర్ ఆదితిసింగ్ రంగంలోకి దిగి సజ్జల ఎస్టేట్ భూములను పరిశీలించారు.
సమగ్ర సర్వే చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కానీ కిందిస్థాయి అధికారులంతా వైఎస్సార్సీపీనేతలతో అంటకాగినందున తప్పించుకునేలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక లాభం లేదనుకున్న పవన్ కల్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పర్యటన చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈనెల 20వ తేదీలోపు పవన్ కల్యాణ్ కడపలో పర్యటిస్తారనే సమాచారం ఉంది.
అటవీ భూముల్లో మట్టి మాయం- అధికారులకు కనిపించని అక్రమం
సజ్జల కుటుంబ సభ్యులకు చెందిన 184 ఎకరాల్లో కొన్ని డీకేటీ భూములూ ఆక్రమణకు గురయ్యాయి. సర్వేనంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్లు డీకేటీ భూమి ఉంది. వాటిలో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ కుటుంబ సభ్యుల పేరుతో రెండున్నర ఎకరాల డీకేటీ పట్టా భూమిని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. 1993లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాను సజ్జల కుటుంబ సభ్యులు బెదిరించి ఆక్రమించారని బాధితుడు రాజానాయక్ ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు లేఖలు పంపారు. భూమిని వదులుకోక పోతే చంపేస్తామని సజ్జల సోదరుడి కుమారుడు సందీప్ రెడ్డి బెదిరించినట్లు రాజానాయక్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ నేతలను ఎదురించి ముందుకు రాని బాధితులు ఎందరో ఉన్నారని సమాచారం. అటవీ భూములు ఆక్రమణకు గురైనా వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడితో ఇప్పటివరకు పనిచేసిన జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు మిన్నకుండి పోయారనే విమర్శలు ఉన్నాయి.
అటవీ భూములపై హక్కుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతానికిపైగా అనర్హులే!