Rain Alert in AP : ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్, హుద్ హుద్, అంపన్ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సీజన్‌లో కూడా బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి.
ఏపీ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు :బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలోనే అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో నేటి నుంచి కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.