NRI Helps For Child's Brain Surgery in Hanamakonda :ఎన్ఆర్ఐ దాతృత్వంతో చిన్నారి మహాన్కు శస్త్ర చికిత్స జరిగింది. ఈటీవీ భారత్లో ఇటీవల వచ్చిన కథనాలకు స్పందించిన ఎన్ఆర్ఐ ఉదార స్వభావంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని చిన్నారి ప్రాణాలను కాపాడారు.
హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్, అశ్విత దంపతులకు మూడేళ్ల పాపతో పాటు ఏడాది వయసుగల మహాన్ ఉన్నాడు. బాబు పుట్టిన నెల రోజులకు ప్రారంభమైన మొదలయ్యాయి వారి కష్టాలు. బాబు పుట్టిన నెల రోజులకే అనారోగ్యం పాలవ్వడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు మహాన్ మెదడులో రక్తం గడ్డ కట్టిందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
వెంకటేష్, అశ్విత బాబుని తీసుకుని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహాన్ని పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో అప్పులు చేసి మరి మూడు సార్లు శస్త్ర చికిత్స చేయించారు. పూర్తిగా నయం కాకపోవడంతో మరో రెండు ఆపరేషన్లు చేయాలని దానికి సూమారు రూ.6లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు
NRI Responded And Child Went to Under Surgery : ఈ క్రమంలో మహాన్పై ఈటీవీ భారత్లో కథనాలు వచ్చాయి. దీనిపై ప్రవాస భారతీయుడు స్పందించారు. హైదరాబాద్లో ఉన్న తమ బంధువుల ద్వారా వైద్యులతో మాట్లాడారు. శస్త్ర చికిత్సకు ఎంత ఖర్చయిన భరిస్తామని, బాలుడికి ఆపరేషన్ చేయాలని ఆసుపత్రిలో కొన్ని డబ్బులు చెల్లించారు. సహాయం చేసిన ఆ వ్యక్తి తన పేరును కూడా వెల్లడించలేదు. దీంతో గురువారం బాలుడికి శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించారు.