Sankranti Festival Special Buses : సంక్రాంతి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 6,432 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని తెలిపింది. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా 5,240 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ సంక్రాంతికి అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపింది.
మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం : రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నాయి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తుంది.
ప్రయాణికుల కోసం ఏర్పాట్లు : హైదరాబాద్లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించనున్నారు. ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లయిన ఉప్పల్, ఎల్బీనగర్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒరిజినల్ గుర్తింపు కార్డులు తప్పనిసరి : టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సుల్లోనూ యదావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మహిళలు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకొనిరావాలని అధికారులు సూచిస్తున్నారు. ఉచిత ప్రయాణం చేసే మహిళలు కండక్టర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడంలేదని వెల్లడించింది.
హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాలు : ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రతిరోజూ 200 బస్సులు నడిపిస్తున్నామని వాటికి అదనంగా మరో 100 ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.
ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త - అదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు