Walking Health Benefits for Body: వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా బరువు, బీపీ, షుగర్ అదుపులో ఉండాలనుకునేవారు.. వాకింగ్‌ను ఎంచుకుంటారు. అయితే, సరైన ప్రణాళిక లేకుండా వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పద్ధతులు పాటిస్తూ వాకింగ్ చేయడం వల్లే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రముఖ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఏ.యూ శంకర ప్రసాద్ వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పద్ధతులు ఏంటి? వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేసే విధంగా బ్రిస్క్ (స్పీడ్) వాకింగ్ చేస్తున్నప్పుడే అనేక ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని డాక్టర్ శంకర ప్రసాద్ అంటున్నారు. ముఖ్యంగా బరువు, స్థూలకాయంతో వచ్చే బీపీ, షుగర్ సమస్యలను అదుపులో ఉంచుతుందని వివరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ, థైరాయిడ్ హర్మోన్లు మెరుగుపడడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గుతుందని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుందని పేర్కొన్నారు. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందని అంటున్నారు. కండరాలు, ఎముకల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ప్రమాదవశాత్తు కిందపడిన ఎక్కువ ప్రమాదం ఉండదని తెలిపారు.
"మనలో చాలా మంది రోజూ వాకింగ్ చేస్తున్నా సరే.. బరువు, షుగర్ తగ్గట్లేదని అంటుంటారు. అయితే, ఈ సమస్యలతో బాధపడే వారు.. తప్పనిసరిగా కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఇందుకోసం వేగంగా నడిచే బ్రిస్క్ వాకింగ్ చేయాలి. 30 నిమిషాల పైగా వాకింగ్ లేదా 5కిలోమీటర్లు పైగా నడవాలి. ఇంకా రెగ్యూలర్‌గా వారంలో కనీసం 5రోజలు పాటు ఇలా ఏడాదిలో కొన్ని నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా నిధానంగా 1-2 కిలోమీటర్లు నడిస్తే బరువు, బీపీ సమస్యలు తగ్గవు."
--డాక్టర్ ఏ.యూ శంకర ప్రసాద్, కన్సల్టెంట్ ఫిజీషియన్
వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాకింగ్ చేసేటప్పుడు సరైన వాతావరణం, సమయం కూడా చూసుకోవాలని ప్రముఖ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఏ.యూ శంకర ప్రసాద్ అంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో చలికాలంలో తెల్లవారుజామున చేయడం మంచిది కాదని చెబుతున్నారు. కాలుష్యం ద్వారా వచ్చే పొగ వాతావరణంలోనే ఉంటుందని.. దానిని పీల్చడం వల్ల అనేక శ్వాసకోశ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వాకింగ్ చేసేటప్పుడు వేసుకునే దుస్తులు.. సీజన్‌కు అనుగునంగా ధరించాలని సూచిస్తున్నారు. వేసవి కాలంలో కాటన్, చలికాలంలో వెచ్చగా ఉండే ఉన్ని లాంటి దుస్తులు వేసుకోవాలని అంటున్నారు. షూలు ధరించే వారు.. సౌకర్యవంతమైనవి వేసుకోవాలని వివరిస్తున్నారు. ముఖ్యంగా నడిచే దారి కూడా ఎత్తుపల్లాలు, గుంటలు, ట్రాఫిక్ లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదా? ఈ కారణాలు తెలిస్తే ఈజీగా ఆపొచ్చట!