Gautam Gambhir Border Gavaskar Trophy 2025 : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా పెర్ఫామెన్స్ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పలు వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం వేడెక్కిందని సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు విభేదాలు వచ్చినట్లు కూడా ఆ వార్తా కథనాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ విషయాలపై తాజాగా టీమ్ఇండియా కోచ్ గంభీర్ స్పందించారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుకు ముందు జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్లు, కోచ్‌కు మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలని, అవి బయటకు రాకూదని చెప్పారు.
"డ్రెస్సింగ్ రూమ్‌పై మీరు వింటున్న రూమర్స్ అన్నీ కేవలం వార్తలు మాత్రమే వాస్తవాలు కాదు! అక్కడ మేం మాట్లాడుకునేది ఒకే ఒక్క విషయం గురించి. అది ఆటగాళ్ల పెర్ఫామెన్స్. వాళ్లు ఆడే తీరుపై నిజాయతీగా అక్కడ చర్చిస్తాం. ఇది మాకు ఎంతో ముఖ్యమైనది. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, ప్లేయర్ల మధ్య జరిగే చర్చ అక్కడి వరకు మాత్రమే పరిమితం కావాలి. ఎప్పుడూ బయటకు రాకూడదు. అక్కడ నిజాయతీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. జట్టుగా ఏయే విషయాలపై పనిచేయాలనేది ఇక్కడ ప్రతి వ్యక్తికి బాగా తెలుసు. టెస్ట్ మ్యాచ్‌లు ఎలా గెలవాలన్నదానిపైనే మేం ఎప్పుడో చర్చించుకున్నాం. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోనూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు" అని హెడ్ కోచ్ తెలిపారు.
ఏం జరిగిందంటే?
టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, తొలి టెస్టుకు ముందు నుంచే ఒకరకమైన ఘర్షణాత్మక వాతావరణం నెలకొందంటూ పలు వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆసీస్‌తో సిరీస్‌కు పుజారాను జట్టులోకి తీసుకోవాలన్న గంభీర్ రిక్వెస్ట్‌ను సెలక్షన్ కమిటీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు తర్వాత కూడా గంభీర్ ఈ డిమాండ్ చేశారట. అయితే జట్టు సంధి కాలంలో ఉన్న ఈ దశలో కొందరు ఆటగాళ్ల ఆశలు జట్టుకు ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. దీంతో తాజాగా ఈ విషయంపై గంభీర్ క్లారిటీ ఇచ్చారు.
టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన- ప్లేయర్లే కాదు, గంభీర్ ప్లేస్‌కు కూడా నో గ్యారెంటీ!