Is Brinjal Can Cause Skin Allergies: "ఆహా ఏమి రుచీ.." అంటూ వంకాయ కూర లాగిస్తుంటారు కొందరు. రుచితోపాటు ఎన్నో పోషకాలు ఈ కాయగూర సొంతం. అయితే.. స్కిన్ అలర్జీతో బాధపడేవారు వంకాయ తినకూడదని చాలా మంది చెబుతుంటారు. తింటే.. సమస్య ఎక్కువ అవుతుందని భయపెడుతుంటారు. మరి.. అలర్జీలతో ఇబ్బందిపడేవారు వంకాయ తినకూడదా? దీనికి నిపుణుల సమాధానం ఏంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సాధారణంగా స్కిన్ అలర్జీ అనేది రకరకాల కారణాల వల్ల రావొచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి అంటున్నారు. అలర్జీ సమస్య ఉన్నా కూడా వంకాయ తినొచ్చని చెబుతున్నారు. అయితే.. కేవలం ఈ కూరగాయ(వంకాయ) తినడం వల్లే అలర్జీ సమస్య ఉందని తెలిస్తే మాత్రం కొన్నాళ్లు ఈ కూరగాయను తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు. పూర్తిగా మానేయాల్సిన అవసరమైతే లేదంటున్నారు.
"వంకాయ సొలనేసి కుటుంబానికి చెందినది. దీంతో పోల్చితే... క్యాప్సికం, బంగాళాదుంప, టమాటల్లో అలర్జీ కారకాలు ఎక్కువ. అయినా సరే... ఎక్కువమంది వంకాయ వల్లే సమస్య ఎదురవుతుందని అపోహపడుతుంటారు"- డాక్టర్ లతాశశి, పోషకాహార నిపుణురాలు
అందరూ మానేయాల్సిన అవసరం లేదు: సహజంగా ఫుడ్ అలర్జీ వల్ల దద్దుర్లు, నోటి దగ్గర వాపు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇలాంటప్పుడు కనీసం ఆరు వారాల పాటు దానికి దూరంగా ఉండాలంటున్నారు. ఆ తర్వాత వాటిని తినాలనుకున్నప్పుడు చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పటికీ సమస్య కనిపిస్తుంటే వదిలేయొచ్చని చెబుతున్నారు.
అయితే.. అలర్జీలు, ఫుడ్ రియాక్షన్స్ అనేవి ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండొచ్చని.. జన్యు సమస్యలే ఇందుకు కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారు. కాబట్టి ఎవరికో అలర్జీ వస్తే అందరూ వంకాయను తినడం మానేయాల్సిన అవసరం లేదని.. ఈ కూరగాయలో పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నిరభ్యంతరంగా తినొచ్చని సూచిస్తున్నారు.
ఇలా టెస్ట్ చేసుకోండి: ఒకవేళ ఏ పదార్థాల వల్ల అలర్జీ ఉందో తెలుసుకోవడానికి రేడియో అలర్జోసార్బెంట్ టెస్ట్(రాస్ట్) అనే రక్త పరీక్ష చేయించుకుంటే సరి అంటున్నారు. ఇది ఇమ్యునోగ్లోబులిన్ ఈ(ఐజీఈ) యాంటీబాడీల స్థాయిని కొలిచి.. ఏ పదార్థాలు, ఉత్పత్తులు పడవో చెబుతుందని.. తద్వారా ఆ కూరగాయ(వంకాయ)ను తినాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవచ్చని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ గజ్జితో భరించలేని అవస్థ - మీరు బాధితులా? - ఈ పనులు చేయాల్సిందే!