Boy Commits Suicide Due To Phone Addiction : ఈరోజుల్లో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. కొంచెం సమయం దొరికిందంటే చాలు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా ఫోన్ మాయలో పడి పిల్లలు తమకు ఫోనే ప్రపంచం అనేంతలా ఫీల్ అవుతున్నారు. ఆన్లైన్ గేమ్స్, రీల్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి రాత్రి, పగలు అనే తేడాను కూడా మర్చిపోయి ప్రవర్తించి, మానసిక రోగాలకు గురవుతున్నారు.
అరేయ్ కాస్త ఫోన్ పక్కన పెట్టు నాన్న అని తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినట్లేదు. పైగా వారినే బెదిరించడానికి అన్నం తినకపోవడం, మాట్లాడకపోవడం వంటివి చేస్తున్నారు. మరి కొంత మంది పిల్లలైతే ఫోన్ లాగేసుకుంటే గట్టిగా అరవడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం చేస్తున్నారు. ఈ మధ్య సోషల్‌మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. తల్లి ఫోన్ వద్దు హోం వర్క్ చేసుకో అని చెప్పినందుకు క్రికెట్ బ్యాట్‌తో తల్లి తలపై కొట్టాడు ఓ పుత్ర రత్నం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఫోన్ అతిగా చూస్తున్నాడని తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని నింపాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట మార్తాండనగర్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. కుమారుడు ఓపెన్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని గతంలోనూ కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. సోమవారం రాత్రి తల్లి తను పనిచేసే సంస్థలో విధులు ముగించుకొని ఇంటికొచ్చారు. ఆ సమయంలో కుమారుడు ఫోన్ చూస్తూ ఉండటంతో మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి : పిల్లలు ఫోన్లు, ట్యాబ్, టీవీలు చూసే సమయాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి గురించి పిల్లలకు అర్థమయ్యేలా తెలపాలంటున్నారు. డిజిటల్‌కు అలవాటు పడితే వచ్చే నష్టాల గురించి చెప్పాలి. పిల్లలతో తల్లిదండ్రులు సమయాన్ని గడపాలి. మెదడు చురుకుతనం పెంచే కార్యకలాపాల వైపు వారిని మళ్లించాలి. పుస్తకాలు చదివించడం, చిత్రలేఖనం, ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. నిద్రకు ముందు ఫోన్లు పిల్లలకు దూరంగా ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
'పిల్లలకు ఫోన్ ఇస్తే మాటలు రావు'- ఆటిజం, ఏడీహెచ్‌డీ వచ్చే ఛాన్స్! మరి ఏం చేయాలి?
మీ పిల్లలు ఫోన్ చూస్తూ సరిగ్గా చదవట్లేదా? ఇలా చేస్తే ఏకాగ్రత, ఇంట్రెస్ట్ పెరగుతుందని సలహా!