Low Glycemic Index Rice Health Benefits: డయాబెటిస్.. ప్రస్తుత రోజుల్లో ఇది అందరినీ బాధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీని బాధితులే. ఇక ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వేసుకునే మందుల నుంచి తినే తిండి వరకు అన్నింటిని కంట్రోల్ చేసుకోవాలి. అందుకే డయాబెటిస్ బాధితులు అన్నం తినడాన్ని తగ్గిస్తుంటారు. ఎందుకంటే అన్నంలో అధికంగా ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్.. రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగేలా చేస్తుంది. అయితే అలా కాకుండా అన్నం తిన్నా.. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగుకుండా ఉండేలా తక్కువ GI (Glycemic Index) కలిగిన వరి రకాలను అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆ నాటికి: టైప్ 2 డయాబెటిస్ ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారింది. 2021లో మధుమేహా బాధితుల సంఖ్య 537 మిలియన్లు కాగా.. ఈ సంఖ్య 2045 నాటికి 780 మిలియన్లను అధిగమించగలదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర పానీయాల అధిక వినియోగం, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో సహా.. ఇతర పదార్థాల వినియోగం మధుమేహానికి దారి తీస్తుందని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IRRI) అండ్ జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌ల శాస్త్రవేత్తలు.. ఆసియాలో పెరుగుతున్న డయాబెటిస్ మహమ్మారిని పరిష్కరించడానికి ఒక సాధనంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (తక్కువ GI) రైస్ ఉపయోగపడుతుందని పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన వివరాలు Proceedings of the National Academy of Sciences (PNAS)లో ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం క్లిక్ చేయండి).
పరిశోధన వివరాలు ఇవే: IRRI శాస్త్రవేత్తలు.. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ, బల్గేరియాలోని సెంటర్ ఆఫ్ ప్లాంట్ సిస్టమ్స్ బయాలజీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక సరికొత్త వరి వంగడాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అండ్ అధిక ప్రోటీన్ కంటెంట్ (PC) మిల్లింగ్ లైన్ రైస్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ రకం బియ్యం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయని, ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతూ అన్నం అధికంగా తీసుకుంటున్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని IRRI గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ సెంటర్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ నెస్ శ్రీనివాసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఇప్పటికే BR-16, IRRI-147 వరి రకాలను పండిస్తున్నారు. ఇప్పుడు సాంబామసూరి అండ్ IR36 వరి రకాలను ఆసియా అంతటా పండించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
అయితే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన బియ్యం తినడం వల్ల కేవలం డయాబెటిస్ కంట్రోల్లో ఉండటమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
బరువు తగ్గడం: తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుందని.. దీనివల్ల అనవసరంగా తినడం తగ్గుతుందని, ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటున్నారు.
హృదయ ఆరోగ్యం: తక్కువ GI ఆహారాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అంటున్నారు. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచడంలో సహాయపడతాయని వివరిస్తున్నారు.
శక్తి స్థాయిలు: తక్కువ GI ఆహారాలు మనకు స్థిరమైన శక్తిని అందిస్తాయని.. దీని వల్ల మనం మరింత చురుగ్గా ఉంటామని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్ ట్రీట్మెంట్లో కొత్త మార్పులు? ఏ మందులు వాడాలో తెలుసా?