Drunken Father Kills Son in Vishakapatnam : తండ్రీకుమారుడి మధ్య మాటా మాటా పెరిగింది. అది పట్టరాని కోపంగా మారి, హత్యకు దారి తీసింది. ఏ తండ్రైనా కుమారుడిపై కోపం వస్తే మాములుగా రెండు, మూడు దెబ్బలు వేసి శాంతిస్తారు. కానీ మద్యం ఆ తండ్రి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. తలకెక్కిన మత్తు విచక్షణ మరిచిపోయేలా చేసింది. కనిపెంచిన కుమారుడిపై ఉన్మాదంగా దాడి చేయడానికి కారణమైంది. మత్తు దిగాక, మెలకువ వచ్చాక తాను ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడో ఆ తండ్రికి తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. కుమారుడి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.
ఏపీలోని విశాఖపట్నం నర్సీపట్నంలో మద్యం మత్తులో కన్న కుమారుడిని తండ్రే హత్య చేసిన ఘటన ఆదివారం సంచలనం సృష్టించింది. సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ నర్సీపట్నం లక్ష్మీనగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్య సత్యవతి కొనేళ్ల కిందట మృతి చెందింది. వీరికి కుమారుడు, కుమార్తె పావని ఉన్నారు. తండ్రీ, కుమారుడు అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు. వారికి సమీప గ్రామంలో కుమార్తె పావని ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వారి దగ్గరికి వచ్చి యోగక్షేమాలు కనుక్కుని వెళ్తుంటుంది. వీరిద్దరికి వంట, ఇంటి పనులు చేసేందుకు పని మనిషి ఉంది.
పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!
డబ్బుల విషయంలో గొడవ : శనివారం రాత్రి కుటుంబానికి సన్నిహితుడైన జిలానీతో కలిసి ఇంట్లో మద్యం సేవించారు. డబ్బు ఖర్చు చేస్తున్నావంటూ తండ్రి, కుమారుడు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మద్యం తాగడం పూర్తయ్యాక జిలానీ తన ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికే తండ్రి కుమారుడి మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. కోపం అదుపు తప్పడంతో తండ్రి రమణ పూరీ కర్రతో కుమారుడి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.
మద్యం మత్తులోనే రమణ తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత బయటకు వచ్చి చూస్తే కుమారుడు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. కుమారుడిని చూసి తండ్రి బోరున విలపించాడు. కొద్దిసేపటికే ఇంటికొచ్చిన పని మనిషికి రాత్రి జరిగిందంతా చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో సీఐ గోవిందరాజు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. భాస్కర్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
'నా భార్యనే చూస్తావా?' - ఇనుప రాడ్డుతో కొట్టి యువకుడి హత్య
5 గుంటల భూమి కోసం దారుణానికి ఒడిగట్టిన తమ్ముడు, మరదలు - అసలు ఏమైందంటే?