Ayyappa Panchamrutham Health Benefits: ఆలయాల్లో దేవుడికి సమర్పించే ఆహారం నైవేద్యం. దేవాలయాల్లో మూల విరాట్లకు నైవేద్యంగా పంచామృతాలు ఎంచుకోవడం వెనుక ఎంతో రహస్యం దాగి ఉందంటున్నారు పండితులు. పంచామృతాలు అంటే ఐదు పదార్థాలు. ఆవు పాలు, పెరుగు, చక్కెర లేదా పటికబెల్లం, నెయ్యి, తేనె కలిపి పంచామృతం అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. అయ్యప్ప స్వామి పూజల్లో పంచామృతాభిషేకం అత్యంత ప్రధానమైనది. అయ్యప్ప విగ్రహానికి జలం, కొబ్బరి నీళ్లు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో పాటు భస్మం, చందనం, కనకం(కాయిన్స్) తో అభిషేకాలు జరుపుతుంటారు. వీటితో పాటు వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృత అభిషేకం అయ్యప్పతో పాటు భక్తులకు సైతం అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు.
పంచామృతాల్లో ఉపయోగించే ఆవుపాలు త్వరగా జీర్ణం కావడంతో పాటు శరీర ఎముకల పెరుగుదలకు అవసరమైన కాల్షియం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆవు పాలల్లోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుందని అంటున్నారు. పాలతోనే తయారయ్యే పెరుగులోనూ విశేష ఔషధ గుణాలున్నాయని.. ముఖ్యంగా శరీర వేడిని తగ్గిస్తుందని వివరిస్తున్నారు. ఇంకా ఉదర సంబంధిత వ్యాధులను నియంత్రించడంతో పాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుందని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి చర్మ సౌందర్యంలోనూ చక్కగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సృష్టిలో వెయ్యేళ్లయనా చెక్కుచెదరని ఆహార పదార్థం ప్రకృతి సిద్ధంగా లభించే తేనె మాత్రమేనని అంటుంటారు. తేనెలో లభించే ఖనిజాలు చర్మ సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తాయని.. ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తుందని పేర్కొన్నారు.
- కావాల్సిన పదార్థాలు
- అరటి పండ్లు - రెండు డజన్లు
- చక్కెర లేదా పటిక - 150 గ్రాములు
- యాపిల్స్ - రెండు
- దానిమ్మ పండ్లు - రెండు
- ఖర్జూర - 50 గ్రాములు
- ఎండు ద్రాక్ష - 50 గ్రాములు
- జీడిపప్పు - 20 గ్రాములు
- ఆవు పాలు- 250 మి.లీ.
- పెరుగు - 50 గ్రాములు
- నెయ్యి - స్పూన్
- తేనె - 50 గ్రాములు
తయారీ విధానం
- ముందుగా ఓ శుభ్రమైన పాత్రను తీసుకుని అందులో అరటి పండ్లను తొక్క తీసి మిక్సీలో వేయకుండా చేతితోనే మెత్తగా మెదుపుకోవాలి.
- ఆ తర్వాత చక్కెరను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిశ్రమాన్ని చేతులతోనే కలపాలి.
- అనంతరం ఈ మిశ్రమంలోకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె వేసి కలపాలి.
- ఇప్పుడు జీడిపప్పు, ఎండు ఖర్జూర, దానిమ్మ గింజలు, తొక్క తీసిన యాపిల్‌తో పాటు ఖర్జూర పండ్లను సన్న ముక్కలుగా కోసి కలపాలి.
- చివరగా ఓ గరిటె తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే! పంచామృతం రెడీ!
- ఈ పంచామృతం శరీరానికి బలాన్నివ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జలుబు, దగ్గుతో ఇబ్బందా? రాత్రి నిద్ర కూడా పట్టట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా తగ్గే ఛాన్స్!